Sangam: సంగం రోడ్డు ప్రమాదంపై ఎంవీఐ రాములు పరిశీలన

Sangam: నెల్లూరు జిల్లా సంగంలో లారీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆత్మకూరు ఎంవీఐ రాములు. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచన.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 17 Aug 2026 7:14 PM IST
Sangam
X

Sangam: సంగం రోడ్డు ప్రమాదంపై ఎంవీఐ రాములు పరిశీలన

సంగం: నెల్లూరు జిల్లా సంగంలో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. రాములు నిన్న లారీ బైక్ను ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన లారీని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు, ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం పూర్తిగా మానుకోవాలని సూచించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

కారు, ఇతర నాలుగు చక్రాల వాహనదారులు సుదూర ప్రయాణాల్లో తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. రహదారిపైకి అకస్మాత్తుగా వచ్చే ఆవులు, గేదెలు, అడవి పందులు వంటి మూగజీవాల పట్ల అప్రమత్తంగా ఉండి, పరిమిత వేగంతో ప్రయాణించాలని తెలిపారు.లారీలు, భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు ఓవర్‌టేక్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

భారీ వాహనాలు నిర్దేశించిన లేన్‌, రోడ్డు మార్జిన్‌లోనే ప్రయాణించాలని సూచించారు.ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులు, కూలీలను ఎక్కించుకోకూడదని రాములు స్పష్టం చేశారు. డ్రైవర్ సీటు పక్కన, వెనుక లగేజ్ బాక్సులపై ప్రయాణికులను కూర్చోబెట్టడం ప్రమాదకరమన్నారు. 12–13 మంది కూలీలు ఉన్న సందర్భంలో ఒకే ఆటోలో కాకుండా రెండు ఆటోలను వినియోగించాలని ఆటో యజమానులు, మేస్త్రీలకు సూచించారు.

ట్రాక్టర్ల వెనుక డోర్లు తెరిచి ఉంచి పొగాకు చెక్కలు తరలించడం, శుభకార్యాలు లేదా తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో ట్రాక్టర్లపై కాళ్లు కిందకు వేలాడదీసుకుని ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. రాత్రి వేళల్లో రహదారులపై ప్రయాణించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అమర్చుకోవాలని సూచించారు.వాహనదారులు ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రయాణిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story