Nellore: అనిల్, ప్రసన్నల కుట్రలను ఆధారాలతో నిలదీసిన ప్రశాంతి రెడ్డి

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొడుతూ ఆధారాలతో నిలదీసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

V. Narasimhulu, Nellore
Published on: 10 Sept 2026 6:36 PM IST
Nellore
X

Nellore: అనిల్, ప్రసన్నల కుట్రలను ఆధారాలతో నిలదీసిన ప్రశాంతి రెడ్డి

నెల్లూరు: వైసీపీ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌లు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి (వీపీఆర్), కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులపై చేస్తున్న కక్షపూరిత ఆరోపణలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గురువారం నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రశాంతి రెడ్డి...

ఆధారాలతో సహా వైసీపీ నేతల మోసాలను, అక్రమాలను నిలదీశారు. అమరావతిలో ఇటీవల జరిగిన టీడీపీ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడు , మంత్రి శ్రీ నారా లోకేష్‌ ఇచ్చిన సూచనల మేరకే, ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు మీడియా ముందుకు వచ్చానని స్పష్టం చేశారు.

"అనిల్ దయనీయమైన గతం ఇదే"

అనిల్ కుమార్‌ యాదవ్ విశ్వాసఘాతుక రాజకీయాలకు చిరునామా అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రం అనిల్ తన చిన్నాన్న రూప్‌ కుమార్‌ను వెంటబెట్టుకుని వచ్చి, ‘మీరే శివపార్వతులు.. ఎన్నికల్లో ఓడిపోతే రోడ్డున పడతాను, నా దగ్గర రూపాయి లేదు’ అని వేడుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ నాడు దయతో ఆదుకున్న వీపీఆర్ పైనే ఈ రోజు నోరు పారేసుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రి పదవి ఊడిపోయాక అనిల్‌కు మైండ్ పనిచేయడం లేదని, 2024 ఎన్నికల్లో నెల్లూరు ప్రజలు తన్ని తరిమేస్తే నర్సారావుపేటకు, అక్కడ కూడా తరిమేస్తే చెన్నైకి పారిపోయాడని ఎద్దేవా చేశారు.

"వీపీఆర్‌కు దందాల అవసరం లేదు.. మైనింగ్ దొంగలు వైసీపీ నేతలే"

వీపీఆర్ కి దేశవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల విలువైన అధికారిక మైనింగ్ కాంట్రాక్టులు ఉన్నాయని, ఇంకా 35 ఏళ్లకు సరిపడా వ్యాపారాలు చేతుల్లో ఉన్నాయని చెప్పారు. సంపాదించిన తర్వాత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వీపీఆర్‌కు ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే 2024లో క్వార్ట్జ్ పరిశ్రమ దిశగా అడుగులు వేశామని, అయితే రాజకీయ రాద్ధాంతం ఇష్టం లేక 2025లోనే అధికారికంగా ఆ భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేశామని వివరించారు. ఈ రోజుకూ క్వార్ట్జ్ మైనింగ్ పేరిట అనిల్ యాదవ్ ఎవరెవరి దగ్గర ఎంతెంత దోచుకున్నాడో 76 మంది బాధితుల జాబితా తన వద్ద ఉందన్నారు. ఇంకా ఎంతో మంది నష్టపోయారని చెప్పారు.

"మైనారిటీలకు అండగా నిలిచింది మేమే"

మైనారిటీల గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదన్నారు. మైనారిటీ నాయకుడు అజీజ్‌ మేయర్ కావడానికి వీపీఆర్ సహాయం చేశారని తెలిపారు. ఖలీల్ అనే మైనారిటీ నేత డిప్యూటీ మేయర్ పదవిని తీసేసి, ఇప్పుడు తన కారు డోర్లు తీయడానికి పరిమితం చేసిన నీచ చరిత్ర అనిల్‌ది అని మండిపడ్డారు. మైనారిటీల సంక్షేమం కోసం మంత్రి నారాయణ రూ.30 కోట్లు ఇస్తే, వీపీఆర్ రూ.14 కోట్లు అధికారికంగా ఇచ్చారని, వారి పిల్లల చదువుల కోసం రూ.20 కోట్లతో పాఠశాల నిర్మిస్తున్నామని వివరించారు.

"ప్రసన్నకుమార్ రెడ్డి అక్రమ మైనింగ్‌పై విజిలెన్స్ విచారణ"

కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి తలమంచి, పంచేడు, రాజుపాళెం ప్రాంతాల్లో చేసిన ఇల్లీగల్ మైనింగ్‌పై ఇంటెలిజెన్స్ ఐజీ నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఆయన అక్రమాల జాతకం బయటపడుతుందని హెచ్చరించారు. ఓ కాంట్రాక్టరును ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చిన ఘనత ప్రసన్నదని, రూ.85 లక్షల బ్యాంకు స్కామ్ వెనుక ఉన్న మస్తానయ్య వ్యవహారం త్వరలోనే తేలుతుందన్నారు. ప్రస్తుతం కోవూరులో ఎలాంటి అవినీతికి తావులేదని, కలెక్టర్ సూచనల మేరకే నిబంధనల ప్రకారం పోతిరెడ్డిపాళెంలో ఇసుక అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. వైసీపీ నేతల అసత్య ప్రచారాలకు, కుట్రలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే కోలుకోలేని దెబ్బతీస్తారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హెచ్చరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story