Nellore: ఆధునీకరించిన డీఎస్ఆర్ పాఠశాలను ప్రారంభించిన నారా లోకేష్!

Nellore: నెల్లూరు మూలాపేటలో రూ.13.41 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునీకరించిన డీఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.

A Praveen, Nellore
Published on: 16 Sept 2026 5:16 PM IST
Nellore
X

Nellore: ఆధునీకరించిన డీఎస్ఆర్ పాఠశాలను ప్రారంభించిన నారా లోకేష్!

Nellore: నెల్లూరు మూలాపేటలో ఆధునిక వసతులతో పునర్ నిర్మించిన డీఎస్ఆర్(దేవిరెడ్డి శారద) ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దేవిరెడ్డి శారద ఛారిటబుల్ ట్రస్ట్ రూ.13.41 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు దేవిరెడ్డి శారద ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ డి.సుధాకర్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ డి.ప్రభాకర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆధునీకరించిన డీఎస్ఆర్ గవర్నమెంట్ హైస్కూల్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని, శ్రీమతి దేవిరెడ్డి శారద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు.

రూ.13.41 కోట్ల వ్యయంతో డీఎస్ఆర్ హైస్కూల్ అభివృద్ధి

డీఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ.13.40 కోట్ల దాతృత్వంతో పాఠశాలను పునర్ నిర్మించారు. రెండంతస్థుల్లో సుమారు 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 తరగతి గదులు నిర్మించారు. విద్యార్థులకు ఆధునిక బోధన అందించేందుకు 15 ఎల్ఈడీ స్క్రీన్ లు, 300 బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత విద్యా అవసరాలకు అనుగుణంగా పాఠశాలలో ప్రత్యేక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్, రోబోటిక్స్, ఆస్ట్రో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లు విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యకు వేదికగా నిలవనున్నాయి. అదేవిధంగా ఆర్ట్, మ్యూజిక్, సిక్, స్టోర్, లాంగ్వేజ్ రూమ్‌లు, లైబ్రరీ వంటి ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట

పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేశారు. బాస్కెట్‌బాల్, పికిల్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, కోకో కోర్టులు సిద్ధం చేశారు. అదే విధంగా ఓపెన్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, కిడ్స్ ప్లే ఏరియా, సెన్సరీ పార్క్, అవుట్‌డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్‌లు ఏర్పాటు చేశారు. ప్లే క్లాస్ నుంచి పదో తరగతి వరకు విద్యాబోధనకు అనువుగా పాఠశాలను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి అడుగుపెట్టిన నాటి నుంచి పాఠశాల విద్య పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని వసతులను ఒకే ప్రాంగణంలో సమకూర్చారు.

పాఠశాల పనితీరుపై మంత్రి సమీక్ష

పాఠశాల భవనాలను ప్రారంభించిన అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యు.పద్మలత, అధికారులతో మంత్రి సమీక్షించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు. గతేడాది కంటే విద్యార్థుల ప్రవేశాలు పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించాలని ప్రశంసించారు. మధ్యాహ్న భోజనంపై ఉపాధ్యాయుల ఫీడ్ బ్యాక్ వందశాతం ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, మంత్రి పి.నారాయణ, పి.షరణి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore