Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 12 Sept 2026 9:09 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

Nellore: నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ స్థానిక నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాకుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించగా, గౌరవ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ సదుపాయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు క్రిటికల్ కేర్ ఆస్పత్రి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది వర్చువల్ విధానంలో వీక్షించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడం నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన అవకాశమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటుచేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర, సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో మెరుగైన వైద్య చికిత్స అందించడం అత్యంత కీలకమని, అందుకు అవసరమైన ఆధునిక వైద్య మౌలిక వసతులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. క్రిటికల్ కేర్ సేవలను మరింత బలోపేతం చేయడంలో ఈ భవనం కీలకపాత్ర పోషిస్తుందని, నెల్లూరు జిల్లా వైద్య చరిత్రలో ఇది ఒక గొప్ప సంస్కరణగా నిలుస్తుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయని గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ అవుతుందని ఆయన అన్నారు. 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నెల్లూరు జిల్లా ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వైద్య రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. మాధవి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE