Nellore: పులికల్లులో 'పల్లెవీక్షణం' పాల్గొననున్న కలెక్టర్
Nellore: జూలై 16న పొదలకూరు మండలం పులికల్లులో కలెక్టర్ హిమాన్షు శుక్లా 'పల్లెవీక్షణం'. అభివృద్ధి పనుల పరిశీలన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం.
Nellore: పులికల్లులో 'పల్లెవీక్షణం' పాల్గొననున్న కలెక్టర్
నెల్లూరు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన “పల్లెవీక్షణం” కార్యక్రమం ఈనెల 16న గురువారం పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను సమీక్షించనున్నారు. పర్యటనలో భాగంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఏపీఎంఐపీ డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని కలెక్టర్ పరిశీలిస్తారు. అనంతరం వీబీజీ రాంజీ కాలువ (జలధార–జలహారతి) పనులను సందర్శించి పురోగతిని సమీక్షిస్తారు.
అలాగే అంగన్‌వాడీ కేంద్రం, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్, తాగునీటి నాణ్యత పరీక్షలు, పశువుల తాగునీటి తొట్టి, సాలిడ్ వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ (ఎస్‌డబ్ల్యూపీసీ) షెడ్, వెంకటాపురం గ్రామంలోని పశువుల షెడ్లను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆదర్శ రైతుతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించి, వ్యవసాయంలో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులపై చర్చించనున్నారు.
డీఆర్‌డీఏ (వెలుగు) ఆధ్వర్యంలో కెనరా బ్యాంకు ద్వారా 16 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.16 లక్షల స్త్రీ శక్తి రుణాలను పంపిణీ చేయనున్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాస విత్తనాలు, పశుగ్రాసాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. చివరగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలు, వినతులను నేరుగా స్వీకరిస్తారు. ఈ పల్లె వీక్షణ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొంటారు.




