Nellore: వాస్తవ నిర్ధారణతోనే బాధ్యతాయుత జర్నలిజం - కలెక్టర్

Nellore: నెల్లూరులో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల శిక్షణా తరగతులు. వాస్తవ నిర్ధారణ, నైతిక విలువలతో వార్తలు అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచన.

V. Narasimhulu, Nellore
Published on: 5 Sept 2026 7:01 PM IST
Nellore
X

Nellore: వాస్తవ నిర్ధారణతోనే బాధ్యతాయుత జర్నలిజం - కలెక్టర్

నెల్లూరు: ప్రజా సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాస్తవాలను ధృవీకరించిన అనంతరం బాధ్యతాయుతంగా వార్తలను అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జర్నలిస్టులకు సూచించారు. శనివారం జడ్పి సమావేశ మందిరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుతం జర్నలిజం రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జర్నలిస్టులకు నిరంతర శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా వార్తలను ఎంపిక చేసుకోవడం, వాస్తవాలను ధృవీకరించడం, నైతిక విలువలను పాటించడం, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాలను సమర్థవంతంగా రిపోర్ట్ చేయడంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ద్వారా అనేక ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని తెలిపారు. వాటిలో వ్యక్తిగత సమస్యలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలకు సంబంధించిన సామూహిక సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు. జర్నలిస్టులు ఇలాంటి సమస్యలను గుర్తించి, వాటి వాస్తవ పరిస్థితులను పరిశీలించి వార్తలుగా తీసుకురావడం ద్వారా ప్రజలకు, అధికారులకు ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలరని అన్నారు.

ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య వెనుక అదే తరహా ఇబ్బందులను మరెంతమంది ఎదుర్కొంటున్నారో గుర్తించి, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమస్యను కేవలం వార్తగా కాకుండా, దానికి పరిష్కారం లభించేలా దోహదపడే విధంగా రిపోర్టింగ్ చేయడం అభినందనీయమన్నారు.

"మీడియా–పరిపాలన పరస్పర సహకారం అవసరం"

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఇటీవల పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తల ద్వారా జిల్లాలో వినియోగంలోకి రాని ప్రభుత్వ ఆస్తులు, క్రీడా సదుపాయాల అంశాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిపై సమీక్ష నిర్వహించి, అందుబాటులో ఉన్న వనరులతో ఆయా సదుపాయాలను ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సదుపాయాలు, పూర్తయినప్పటికీ వినియోగంలోకి రాని ప్రాజెక్టులు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా గుర్తించి వెలుగులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి కూడా విలువైన ఫీడ్‌బ్యాక్ అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

"వార్తలలో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యం"

సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వార్తలను వేగంగా అందించడంతో పాటు, వాటి వాస్తవాలను నిర్ధారించుకోవడం మరింత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. వార్తను ప్రచురించే ముందు సంబంధిత అంశాన్ని మరోసారి పరిశీలించి, వాస్తవాలు, సందర్భం, ప్రజా ప్రయోజనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు, వార్తల విషయంలో వృత్తిపరమైన విలువలు, నైతిక ప్రమాణాలు పాటించాలని తెలిపారు.

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. శిక్షణలో అనుభవజ్ఞులైన నిపుణులు తమ అనుభవాలను, కేస్ స్టడీలను జర్నలిస్టులతో పంచుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే నైతిక సందిగ్ధతలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

శిక్షణలో జర్నలిస్టులు తమ సందేహాలను నిపుణులను నేరుగా అడిగి నివృత్తి చేసుకోవాలని, తమ అనుభవాలను కూడా పరస్పరం పంచుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రజా ప్రయోజనమే వార్తకు ప్రధానమని సి.ఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో విస్తృతమైన గ్రామీణ విలేఖరుల వ్యవస్థ ఉందన్నారు. జిల్లా ఎడిషన్ లు ప్రవేశపెట్టిన సందర్భంగా విలేఖరుల సంఖ్య పెరిగిందన్నారు. వార్త సేకరణ నుంచి రిపోర్టింగ్ చేసేవరకు వున్న క్రమంలో మెళుకువలు జర్నలిస్టులు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఏ వృత్తిలో నైనా నైపుణ్యం పెంచుకునే శిక్షణ అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. నేర్చుకోవడం ఆగిపోతే, సమాజ వికాసానికి అవకాశం వుండదన్నారు. అన్ని రంగాల్లోనూ చోటుచేసుకుంటున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చన్నారు. జర్నలిజం రంగం కూడా యిందుకు మినహాయింపు కాదని అన్నారు. ఇంటర్నెట్ యుగంలో వార్త, ఫోటోలు, వీడియోలు పంపడం సులభం అయిందన్నారు.

"ప్రజా ప్రయోజనమే వార్తకు ప్రధాన గీటురాయి" :-- సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్

సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజా సమస్యలను సమర్థవంతంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన సమాచారాన్ని బాధ్యతాయుతంగా అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.

జర్నలిజం రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

వార్తను ఎంపిక చేసే సమయంలో ప్రజా ప్రయోజనమే ప్రధాన గీటురాయిగా ఉండాలని సూచించారు. వార్తా సేకరణ, వాస్తవ నిర్ధారణ, వార్తా రచన, ఫోటో వినియోగం, ఆధారాల సేకరణ, పరిశోధనాత్మక కథనాల రూపకల్పన వంటి అంశాలపై జర్నలిస్టులకు నిరంతర అవగాహన అవసరమన్నారు.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వార్తలను సేకరించి అందిస్తున్న జర్నలిస్టుల వ్యవస్థ ఎంతో విస్తృతంగా ఉందని, వారికి ఎప్పటికప్పుడు శిక్షణ, మార్గదర్శకత్వం అందించడం ద్వారా జర్నలిజం ప్రమాణాలను మరింత పెంచవచ్చని తెలిపారు.

జర్నలిజం ఒక నిరంతర అభ్యాస ప్రక్రియ అని, “నేను అన్నీ నేర్చుకున్నాను” అనే భావనకు తావివ్వకుండా జీవితాంతం నేర్చుకునే వైఖరిని అలవర్చుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. భాషా నైపుణ్యం, సంక్షిప్తంగా స్పష్టంగా రాయడం, కొత్త ధోరణులను అర్థం చేసుకోవడం వంటి అంశాల్లో నిరంతరం తమను తాము మెరుగుపరుచుకోవాలన్నారు..‌జర్నలిస్టులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించడమే మీడియా అకాడమీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రిఫ్రెషర్ శిక్షణా తరగతుల ద్వారా జర్నలిస్టులకు ఇప్పటికే ఉన్న పరిజ్ఞానాన్ని మరింత పదును పెట్టడంతో పాటు, ఆధునిక జర్నలిజంలో అవసరమైన కొత్త అంశాలను నేర్చుకోవాలన్నారు.

వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే జర్నలిజం యొక్క ప్రాథమిక విలువలు, నైతిక ప్రమాణాలు, ప్రజా ప్రయోజనాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిడి వేణుగోపాల్ రెడ్డి, సి.ఆర్ మీడియా అకాడమి ఓ ఎస్ డి జీవన్, రిసోర్స్ పర్సన్స్, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story