Nellore: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా
Nellore: పల్లె వీక్షణ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మహిళా వ్యాపారవేత్త కళ్యాణికి రూ.80 వేల ఆర్థిక సహాయం అందజేత.
Nellore: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు: ఒక చిన్న ఆలోచనకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే.. అది ఒక కుటుంబానికి ఆర్థిక భరోసాగా మారుతుంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, వారి ఆశయాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “పల్లె వీక్షణ” కార్యక్రమం ఇందుకు మరోసారి నిదర్శనంగా నిలిచింది.
నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ జంగాలకండ్రిగ గ్రామానికి చెందిన ఎద్దుల కళ్యాణికి రూ.80 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జిల్లా కలెక్టర్ ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.
జిల్లా కలెక్టర్ మానసపుత్రికగా నిర్వహిస్తున్న “పల్లె వీక్షణ” కార్యక్రమంలో భాగంగా 2026 జూన్ 19న ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ జంగాలకండ్రిగ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా భ్రమరాంబిక సంఘ సభ్యురాలు ఎద్దుల కళ్యాణి ఏర్పాటు చేసిన కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ యూనిట్‌లో రైతుల వద్ద నుంచి పశువుల పేడను కొనుగోలు చేసి, దానిని కంపోస్ట్‌గా మార్చి, అందులో వేపపిండిని కలిపి నాణ్యమైన కంపోస్ట్ ఎరువును రైతులకు అందిస్తున్నారు. అదేవిధంగా అరటి, మామిడి పండ్ల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. కళ్యాణి చేస్తున్న కృషిని, రైతులకు అందిస్తున్న నాణ్యమైన ఎరువును, ఆమె నిర్వహిస్తున్న వ్యాపార కార్యకలాపాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా కళ్యాణి, ఆమె భర్త తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వేపకాయల పొడి తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఎంత మొత్తం అవసరమని కలెక్టర్ అడగగా రూ.80 వేల వరకు అవసరమని వారు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, తన సొంత నిధుల నుంచి రూ.80 వేల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె వీక్షణ కార్యక్రమంలో ఇచ్చిన హామీని నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కార్యరూపంలోకి తీసుకువచ్చారు. రూ.80 వేల చెక్కును స్వయంగా కళ్యాణికి అందజేసి, మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకత్వానికి, ప్రజల ఆశయాలకు అండగా నిలిచే పరిపాలనకు కలెక్టర్ హిమాన్షు శుక్ల నిదర్శనంగా నిలిచారు.
ప్రజా సమస్యలను కేవలం వినడంతోనే పరిమితం కాకుండా, వాటికి పరిష్కారం చూపడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఉన్న ప్రతిభను, ఆలోచనలను, చిన్నతరహా వ్యాపారాలను గుర్తించి ప్రోత్సహించడం “పల్లె వీక్షణ” కార్యక్రమం ప్రత్యేకత. ఒక మహిళ తనకు తానుగా ఉపాధి కల్పించుకోవడమే కాకుండా, రైతులకు ఉపయోగపడే కంపోస్ట్ ఎరువును తయారు చేస్తూ, తన వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో ముందుకు రావడాన్ని జిల్లా కలెక్టర్ ప్రోత్సహించడం మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చింది.
ఈ ఆర్థిక సహాయం అందుకోవడం పట్ల కళ్యాణి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పల్లె వీక్షణలో తన సమస్యను విని, తాను కోరిన సహాయానికి సానుకూలంగా స్పందించడమే కాకుండా, ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకుని రూ.80 వేల ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజకుమారి పాల్గొన్నారు.




