Nellore: బెజవాడ పాపిరెడ్డి కాలువకు భారీ గండి వృథాగా పోతున్న సాగునీరు!
Nellore: మర్రిపాడు వద్ద కాలువ ఆక్విడెక్ట్ ధ్వంసమై సాగునీరు వృథాగా పోతోంది. వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Nellore: బెజవాడ పాపిరెడ్డి కాలువకు భారీ గండి వృథాగా పోతున్న సాగునీరు!
బెజవాడ పాపిరెడ్డి కాలువకు గండి.... వృధాగా పోతున్న సాగునీరు. అవస్థలు పడుతున్న రైతులు.
నెల్లూరు జిల్లా: సంగం మండలం మర్రిపాడు గ్రామ సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫన్ ఆక్విడెక్ట్ ఆదివారం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విలువైన సాగునీరు భారీ ఎత్తున దువ్వూరు చెరువులోకి వృథాగా ప్రవహిస్తోంది.ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రైతుల కథనం ప్రకారం, సైఫన్ ఆక్విడెక్ట్‌కు కొద్ది రోజుల క్రితమే స్వల్పంగా గండిపడింది. అప్పుడే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి, కాలువలో నీటి మట్టం తగ్గించి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే అధికారులు రైతుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలు చేపట్టడంతో కాలువలో నీటి ఒత్తిడి మరింత పెరిగి, ఆదివారం సైఫన్ ఆక్విడెక్ట్ పూర్తిగా ధ్వంసమైందని రైతులు చెబుతున్నారు. దీంతో భారీగా నీరు బయటకు వెళ్లిపోతూ దువ్వూరు చెరువులోకి చేరుతోంది.ఈ ఘటన కారణంగా మర్రిపాడు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గం దెబ్బతినడంతో వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోయాయి. పంటల సంరక్షణకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందనిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు వెంటనే బెజవాడ పాపిరెడ్డి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు బెజవాడ పాపిరెడ్డి కాలువ అధికారులే పూర్తిగా బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేశారు.




