Sangam: కావలి కాలువ అధికారులపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఫైర్

Sangam: ధ్వంసమైన సైఫన్ ఆక్విడెక్ట్‌ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పరిశీలించి, రూ.27 లక్షల నిధులతో 3 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 28 July 2026 7:09 PM IST
Sangam
X

Sangam: కావలి కాలువ అధికారులపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఫైర్

సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ధ్వంసమైన సైఫన్ ఆక్విడెక్ట్‌ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించి, కాంక్రీట్ పనుల్లో నాణ్యత లోపించడంపై కావలి కాలువ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ దాదాపు 25 రోజులుగా దెబ్బతిని విలువైన నీరు సముద్రంలో కలిసిపోతుందని విమర్శించారు.సైఫన్ దెబ్బతిన్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు లేదా తమ దృష్టికి తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్య తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సైఫన్ మరమ్మతుల కోసం రూ.27 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.

సైఫన్ దెబ్బతినడంతో కాలువ కింద ఉన్న సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాతో పాటు తాగునీటి అవసరాలపై కూడా తీవ్ర ప్రభావం పడిందన్నారు. స్థానిక రైతుల సహకారంతో పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు కాలువ కింద ఉన్న రైతులు ఒకే ప్రాంతంలో అధికంగా నీటిని నిల్వ చేసుకోకుండా, ఆరుతడుల పద్ధతిలో పరస్పర సమన్వయంతో నీటిని వినియోగించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

రాబోయే రెండు మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి రైతాంగానికి, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్లీ కాలువలో నీటి సరఫరా పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story