Nellore: నెల్లూరులో సీసీ రోడ్డు, యూజీడీ జెట్టింగ్ మిషన్ల ప్రారంభం!
Nellore: నగరంలో రూ.28.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు రూ.1.20 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన యూజీడీ జెట్టింగ్ మిషన్లను మంత్రి నారాయణ ప్రారంభించారు.
Nellore: నెల్లూరులో సీసీ రోడ్డు, యూజీడీ జెట్టింగ్ మిషన్ల ప్రారంభం!
Nellore: మంగళవారం నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ జొన్నలగడ్డవారి వీధిలో రూ.28.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి నారాయణ ప్రారంభించారు. అలాగే నెల్లూరు కార్పొరేషన్ రూ.1.20 కోట్లతో కొనుగోలు చేసిన రెండు యూజీడీ జెట్టింగ్ మిషన్ వాహనాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడంపై స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 30 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వ్యాపారస్తులను, స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగగా, అడుగడుగునా స్థానికులు నీరాజనం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసిన అధికారులను అభినందించారు. నెల్లూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.
2014-15లో రూ.550 కోట్లతో నెల్లూరు నగరంలో యూజీడీ పనులను ప్రారంభించామని, మరో రూ.550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి తాగునీటి ప్రాజెక్టు పనులను చేపట్టామని మంత్రి తెలిపారు. సుమారు 90 శాతం పనులు పూర్తయినప్పటికీ గత ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే మిగిలిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌లో మరో రూ.250 కోట్లతో యూజీడీ పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో యూజీడీ పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా యూజీడీ కనెక్షన్లు తీసుకుని ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే దోమల రహిత నగరాన్ని సాధించగలమన్నారు.
గతంలో రూ.10,000గా ఉన్న యూజీడీ కనెక్షన్ ఛార్జీని రూ.1కి తగ్గించామని మంత్రి తెలిపారు. రూ.1,000 లోపు పన్ను చెల్లించే వారికి ఉచితంగా యూజీడీ కనెక్షన్ అందిస్తామని, రూ.2,000 లోపు పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. రూ.2,000కు పైగా పన్ను చెల్లించే వారు పూర్తి మొత్తాన్ని చెల్లించి యూజీడీ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. కనెక్షన్ మొత్తాన్ని ఐదేళ్లలో పది వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించామని తెలిపారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని సుమారు రెండు లక్షల కుటుంబాలు యూజీడీ కనెక్షన్లు తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. 100 శాతం యూజీడీ వ్యవస్థను అమలు చేయడం ద్వారా అమెరికా, రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలు దోమల సమస్యను నియంత్రించగలిగాయని తెలిపారు. నెల్లూరు నగరంలోనూ సంపూర్ణ యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి, డివిజన్ నాయకులు పుట్టా అజయ్, కోకు మహేంద్ర రెడ్డి, సత్య నాగేశ్వరరావు, డాక్టర్ పోకల రవి తదితరులు పాల్గొన్నారు.




