Nellore: స్వాతంత్య్ర దినోత్సవ కానుక మెప్మా మహిళలకు ఎగ్ కార్ట్స్ పంపిణీ
Nellore: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 40 మంది మెప్మా మహిళలకు ఎగ్ కార్ట్స్ పంపిణీ చేసిన మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు జిల్లాలో మొత్తం 47 బండ్ల పంపిణీ.
Nellore: స్వాతంత్య్ర దినోత్సవ కానుక మెప్మా మహిళలకు ఎగ్ కార్ట్స్ పంపిణీ
Nellore: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని మెప్మా మహిళలకు కూటమి ప్రభుత్వం స్వయం ఉపాధి కానుక అందించింది. గోమతినగర్ క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ 40 మంది మెప్మా మహిళలకు ఎగ్ కార్ట్ బండ్లను పంపిణీ చేశారు. ఎగ్ కార్ట్స్ అందుకున్న మహిళలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన “ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త” లక్ష్యంలో భాగంగా మెప్మా–నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగ్ కార్ట్ అనేది కేవలం ఒక బండి పంపిణీ కార్యక్రమం కాదని, ఒక మహిళ చేతిలో ఉపాధి సాధనం పెట్టి ఒక కుటుంబానికి ఆదాయ మార్గం చూపించే కార్యక్రమమని పేర్కొన్నారు.ఒక్కో SHG మహిళకు సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్‌ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్న వ్యాపారంగా ప్రారంభించి, కష్టపడి పనిచేస్తే ప్రతిరోజూ ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు.
మహిళ చేతిలో సంపాదన ఉంటే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది. అందుకే మహిళా సాధికారతే కుటుంబ సాధికారత” అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 300 మంది మహిళలకు ఎగ్ కార్ట్స్ పంపిణీ చేశామని మంత్రి వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలో తొలి విడతలో ఏడు ఎగ్ కార్ట్స్ పంపిణీ చేయగా, రెండో విడతలో భాగంగా శనివారం 40 మందికి అందించినట్లు తెలిపారు. రెండు విడతల్లో కలిపి జిల్లాలో మొత్తం 47 ఎగ్ కార్ట్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు.
నెల్లూరు నగరానికి చెందిన 20 మంది మహిళలకు ఈ రోజు ఎగ్ కార్ట్స్ అందించడం జరిగిందన్నారు.మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా, ఆర్థికంగా స్వావలంబన కలిగిన శక్తిగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
SHG మహిళలకు ఇప్పటికే పొదుపు, ఆర్థిక నిర్వహణ, బ్యాంకింగ్ వంటి అంశాల్లో అనుభవం ఉందని, ఇప్పుడు ఆ అనుభవానికి వ్యాపార నైపుణ్యాన్ని జోడిస్తున్నామని చెప్పారు.ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి అనే ఆలోచనను దాటి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినట్లే ప్రతి కుటుంబం, ప్రతి మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి, సంపద సృష్టికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి వారికి మార్కెట్, బ్యాంకు రుణాలు, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.మహిళలకు పంపిణీ చేసిన ఎగ్ కార్ట్స్‌ను కేవలం ప్రభుత్వ కానుకగా భావించవద్దని మంత్రి సూచించారు.
మీ చేతిలోకి వచ్చిన ఎగ్ కార్ట్ మీ కుటుంబ భవిష్యత్తుకు పెట్టుబడి. దీన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆదాయాన్ని పెంచుకోవాలి. మీ పిల్లల చదువుకు, కుటుంబ అవసరాలకు అండగా నిలవాలి” అని మహిళలకు సూచించారు.
ఈ రోజు ఎగ్ కార్ట్‌తో ప్రారంభించిన ప్రయాణం రేపు సొంత దుకాణం, సొంత వ్యాపారంగా ఎదగాలని, భవిష్యత్తులో మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం మీకు చేయూత ఇస్తుంది.. మీరు మీ కష్టంతో విజయాన్ని సాధించాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.
MEPMA, NECC, SHG మహిళలు సమన్వయంతో పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత విజయవంతమై, రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా విస్తరించగలదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి,నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు,టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.




