Nellore: ప్రారంభానికి సిద్ధమైన నెల్లూరు మూలాపేట DSR ప్రభుత్వ బడి!

Nellore: నెల్లూరు మూలాపేటలో రూ.13.40 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించిన DSR ప్రభుత్వ హైస్కూల్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు.

A Praveen, Nellore
Published on: 15 Sept 2026 6:25 PM IST
Nellore
X

Nellore: ప్రారంభానికి సిద్ధమైన నెల్లూరు మూలాపేట DSR ప్రభుత్వ బడి!

నెల్లూరు: శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల నేడు రాజుల కోటను తలపించేలా రూపుదిద్దుకుంది. తరగతి గదుల నుంచి ల్యాబొరేటరీల వరకు,క్రీడా ప్రాంగణాల నుంచి లైబ్రరీ వరకు విద్యార్థుల భవిష్యత్‌కు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో సమకూర్చుకున్న సరస్వతీ నిలయంగా నిలిచింది నెల్లూరు సిటీ నియోజకవర్గం మూలాపేటలోని DSR ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, యువనేత, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా, నెల్లూరు సిటీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలన్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పానికి ఈ పాఠశాల మరో నిదర్శనంగా నిలుస్తోంది.

నెల్లూరు నగరంలో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మంత్రి నారాయణ ఇప్పటికే VRC ప్రభుత్వ హైస్కూల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్ది బృహత్ కార్యక్రమానికి నాంది పలికారు. అదే స్ఫూర్తితో మూలాపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను కూడా ఆధునిక వసతులతో తీర్చిదిద్దేందుకు ముందడుగు వేశారు. మంత్రి నారాయణ చొరవతో DSR కన్స్ట్రక్షన్స్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ.13.40 కోట్ల దాతృత్వంతో పాఠశాలను అద్భుతంగా పునర్నిర్మించారు. పాఠశాలకు దేవిరెడ్డి శారదా ప్రభుత్వ హైస్కూల్ గా నామకరణం చేశారు.

రెండంతస్తుల్లో సుమారు 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 తరగతి గదులు నిర్మించారు. విద్యార్థులకు ఆధునిక బోధన అందించేందుకు 15 LED స్క్రీన్లు, 300 బెంచీలు ఏర్పాటు చేశారు.

ప్రస్తుత విద్యా అవసరాలకు అనుగుణంగా పాఠశాలలో ప్రత్యేక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్, రోబోటిక్స్, ఆస్ట్రో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లు విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యకు వేదికగా నిలవనున్నాయి.

అంతేకాకుండా ఆర్ట్, మ్యూజిక్, సిక్, స్టోర్, లాంగ్వేజ్ రూమ్‌లు, లైబ్రరీ వంటి ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేశారు. బాస్కెట్‌బాల్, పికిల్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, కోకో కోర్టులు సిద్ధమయ్యాయి.

అదే విధంగా ఓపెన్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, కిడ్స్ ప్లే ఏరియా, సెన్సరీ పార్క్, అవుట్‌డోర్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్‌లు ఏర్పాటు చేశారు.ప్లే క్లాస్ నుంచి పదో తరగతి వరకు విద్యాబోధనకు అనువుగా పాఠశాలను తీర్చిదిద్దారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి అడుగుపెట్టిన నాటి నుంచి పాఠశాల విద్య పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని వసతులను ఒకే ప్రాంగణంలో సమకూర్చారు.

15 పాఠశాలలు,15 వేల మంది పేద విద్యార్థులు

నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నది మంత్రి నారాయణ సంకల్పం. నగరంలోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి.. సుమారు 15 వేల మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఆస్తిగా అందించాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.

పేదరికం కారణంగా ఏ విద్యార్థి అవకాశాలను కోల్పోకూడదు అన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆధునిక విద్య, క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ విద్యాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు.

తండ్రి సంకల్పం కోసం నెల్లూరులోనే పొంగూరు షరణి

పాఠశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తండ్రి ఆదేశాల మేరకు నెల్లూరులోనే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు.పాఠశాల నిర్మాణ పనులు, తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా ప్రాంగణాలు, ఇతర వసతుల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రారంభోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్నారు.

రేపు లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభం

అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న దేవిరెడ్డి శారదా ప్రభుత్వ హైస్కూల్‌ను నేడు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు.ఏర్పాట్లను మంత్రి నారాయణ,ఎంపీ వేమిరెడ్డి,దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి,సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం నాలుగు గోడలు, కొన్ని తరగతి గదులు మాత్రమే కాదని,పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలను అందించే వేదికగా ఉండాలన్న ఆలోచనకు DSR పాఠశాల ప్రతిరూపంగా నిలవనుంది.

చంద్రబాబు విజన్,లోకేశ్ ఆలోచన,నారాయణ సంకల్పం దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి దాతృత్వం ఈ నాలుగు కలిసిన ఫలితమే మూలాపేటలో కొలువుదీరిన ఈ కొత్త సరస్వతీ నిలయం.

A Praveen, Nellore

A Praveen, Nellore