Kadirinenipalli: ప్రజా సమస్యలపై తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ!
Kadirinenipalli: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లిలో తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవం జరిగింది.
Kadirinenipalli: ప్రజా సమస్యలపై తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ!
కదిరినేనిపల్లి: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామంలో గురువారం పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కె.సి.హెచ్.వి. అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి పౌరుడికి పూర్తి అవగాహన ఉండాలని, సమాజంలో కుల వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సోదరభావంతో జీవించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పలు చట్టాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ కాలనీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొన్నదని, ఒక రోజు నీరు వస్తే మరుసటి రోజు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కదిరినేనిపల్లి ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం మూడో తరగతి వరకు మాత్రమే బోధన జరుగుతోందని, నాలుగో తరగతిలో చేరే విద్యార్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని చిన్నమాచనూరు గ్రామానికి ఆటోలో వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. చిన్నారులు ప్రతిరోజూ దూరప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామ పాఠశాలలోనే నాలుగో, ఐదో తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామానికి చెందిన కోలకాని నారాయణమ్మ తన భర్త ఇటీవల మృతి చెందడంతో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఆధార్ కార్డులో తన వయస్సు పొరపాటున 95 సంవత్సరాలుగా నమోదైందని, దానిని సరిచేసి పింఛన్ మంజూరు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని, భూ సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామంలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, భూమిలేని పేదలకు సాగుభూములు ఇవ్వాలని, ఎస్సీ కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.
గ్రామస్తులు సమర్పించిన వినతిపత్రాలను సంబంధిత శాఖల అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్, హౌసింగ్ ఏఈ రవికుమార్, ఆర్‌ఐ పెంచలయ్య, అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండలాధ్యక్షుడు ఆర్ల శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్, విఆర్వో గౌస్, పంచాయతీ కార్యదర్శి వెంగళరెడ్డి, కుల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




