Vinjamur: వింజమూరులో స్వర్ణోత్సవాలు!

Vinjamur: ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ కల్పనకర్తలుగా ఎదగాలని యువతకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు స్వర్ణోత్సవాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Aug 2026 1:24 PM IST
Vinjamur
X

Vinjamur: వింజమూరులో స్వర్ణోత్సవాలు!

Vinjamur: యువత కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. వింజమూరులోని యేల్చూరి రంగనాధం జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

శ్రీ రాజా సత్యనారాయణ త్యాగం,దాతల ఉదారతతో ఏర్పడిన ఈ విద్యాసంస్థ ఈ ప్రాంతంలో విద్యా వెలుగులు నింపిందని వెంకయ్య నాయుడు అన్నారు.కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

కళాశాల పూర్వవైభవాన్ని పునరుద్ధరించడంతో పాటు మరింత అభివృద్ధి చేసేందుకు దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దంలో కేవలం సర్టిఫికెట్లతో సరిపెట్టుకోకుండా యువత రీ-స్కిల్లింగ్‌, అప్‌-స్కిల్లింగ్‌పై దృష్టి సారించాలన్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌,డిజిటల్‌ విప్లవం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సాంకేతికతను నేర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణ,క్రిటికల్‌ థింకింగ్‌ను అలవర్చుకుని ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ కల్పనకర్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

నైపుణ్యం కలిగిన యువతే వికసిత భారత నిర్మాణానికి అసలైన పునాది అని వెంకయ్య నాయుడు అన్నారు.అదే సమయంలో యువత మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ మాతృభాషను గర్వంగా మాట్లాడాలని సూచించారు.

విద్యార్థులు జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండి సమతుల ఆహారం తీసుకోవాలని, ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఆరోగ్యంపై దృష్టి పెట్టినప్పుడే యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story