Nellore: కలిగిరి పెద్దచెరువుపై గ్రావెల్ మాఫియా కన్ను!

Nellore: నెల్లూరు జిల్లా కలిగిరి పెద్దచెరువులో ఇరిగేషన్ కార్యాలయం ఎదుటే సెలవు రోజున జోరుగా సాగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు; అధికారుల తీరుపై ఆగ్రహం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Aug 2026 12:51 PM IST
Nellore
X

Nellore: కలిగిరి పెద్దచెరువుపై గ్రావెల్ మాఫియా కన్ను!

Nellore: కలిగిరి పెద్దచెరువుపై గ్రావెల్ మాఫియా కన్ను.. సెలవు రోజున జోరుగా తవ్వకాలు?

నెల్లూరు జిల్లా కలిగిరి పెద్దచెరువులో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.ఆదివారం సెలవు దినాన్ని ఆసరాగా చేసుకుని చెరువులో భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వి,టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.చెరువులో నాలుగు టిప్పర్లు, ఒక 200 హిటాచీ యంత్రం వినియోగిస్తూ గ్రావెల్‌ను వెలికితీసి తరలిస్తున్నట్లు సమాచారం. ఇరిగేషన్ కార్యాలయానికి ఎదురుగానే ఈ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు అడ్డుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల కళ్లముందే తవ్వకాలు?

చెరువుల పరిరక్షణ బాధ్యత కలిగిన ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి సమీపంలోనే భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.సెలవు రోజుల్లో పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని తవ్వకాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ అక్రమ గ్రావెల్ తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండదండలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా ఇరిగేషన్ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

చెరువు భవితవ్యంపై ఆందోళన

గ్రావెల్ తవ్వకాల కారణంగా పెద్దచెరువు స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన చెరువు భూమిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

కార్యాలయానికి ఎదురుగానే తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదు.అక్రమ గ్రావెల్ తరలింపు వెనుక అసలు ఎవరున్నారు.

మామూళ్ల ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తారా.అనే ప్రశ్నలు ఇప్పుడు కలిగిరిలో చర్చనీయాంశంగా మారాయి. పెద్దచెరువులో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న గ్రావెల్ తవ్వకాలపై ఉన్నతాధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, నిజానిజాలను నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story