Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వైభవంగా దీపపూజ!
Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి దీపపూజ వేలాదిగా పాల్గొన్న మహిళలు, వేమిరెడ్డి దంపతులు.
Nellore: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వైభవంగా దీపపూజ!
Nellore: శ్రావణ శుక్రవారం సందర్భంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి నెల్లూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది మహిళలు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ), వీపీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులతో కలిసి దీపపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం సాయంత్రం మన సింహపురిలో తితిదే, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో దీపపూజ జరగడం చాలా గొప్ప విషయమని అన్నారు.
ఈ లక్ష్మీ పూజ కోసం అమ్మవారు తిరుచానూరు నుంచి స్వామివారితో సహా విచ్చేశారని తెలిపారు. దేవతామూర్తుల విగ్రహాలను నెల్లూరులో ప్రతిష్ఠించి పూజించుకోవడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వీపీఆర్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో వేమిరెడ్డి దంపతులుగా తాము భాగం కావడం నిజంగా భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఏ దైవ కార్యక్రమం అయినా చేయాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలని, పూర్వజన్మ సుకృతం ఉండాలని అన్నారు. ఇది తాము చేస్తున్న సేవ కాదని.. భగవంతుడే తమతో ఈ సేవ చేయించుకుంటున్నారని భావిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో అష్టోత్తరశతనామావళి, అమ్మవారి కుంకుమ పూజ అనంతరం దీపపూజ నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ స్వామివారి కంకణాలు, పసుపుతాళ్లు పంపిణీ చేయడంతో పాటు ప్రసాద వితరణ చేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు.




