Nellore: వెంగళరావునగర్ పాఠశాలలో గిడుగు రామమూర్తి 163వ జయంతి!

Nellore: నెల్లూరు వెంగళరావునగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో గిడుగు వెంకట రామమూర్తి 163వ జయంతి. వ్యవహారిక భాషోద్యమంపై అవగాహన.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 29 Aug 2026 5:20 PM IST
Nellore
X

Nellore: వెంగళరావునగర్ పాఠశాలలో గిడుగు రామమూర్తి 163వ జయంతి!

Nellore: నగరపాలక ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్ నెల్లూరు నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని మంజులవాణి అధ్యక్షతన తెలుగు ఉపాధ్యాయులు గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి నూట అరవై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తొలుత వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ.

శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో జన్మించిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పర్వతాలపేటలోనూ.. ఉన్నత పాఠశాల, కళాశాల విద్యను తన మేనమామ ఇంట విజయనగరం రాజావారి కళాశాలలోనూ పూర్తి చేశారని, తొలుత చరిత్ర అధ్యాపకులుగా తన జీవితాన్ని ప్రారంభించిన వెంకట రామ్మూర్తి పంతులు.

చారిత్రక పరిశోధకుడిగా శాసన పరిశీలకులుగా మారి వాస్తవాలను ప్రజలకు తెలియజేసే వారని, తాను పనిచేస్తున్నటువంటి పాఠశాలకు సమీపంలో ఉన్నటువంటి పర్లాకిమిడి ప్రాంతంలోని సవర గిరిజన తెగలకు విద్యా బోధన చేసి, వారి సవర భాషను తాను నేర్చుకొని, లిపిలేని సవర భాషకు లిపిని రూపొందించి తెలుగు నుంచి సవర భాషకు సవర భాష నుంచి ఇంగ్లీషుకు, వ్యాకరణాన్ని రచించారని.

సవరుల బ్రతుకుల్లో విజ్ఞాన వెలుగులో నింపిన మహనీయుడని గ్రాంధిక భాష వాదులతో పోరాడి సామాన్య జనులు నిత్య వ్యవహారంలో ఉపయోగించే భాషలోనే కవులు రచయితలు తమ రచనలు చేయాలని గొప్ప పోరాటం చేసి చివరకు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడుగా తెలుగు భాషకు విశేష సేవలు అందించిన గిడుగు తెలుగువారి కీర్తి పతాక అని, సవరుల కోసం ప్రత్యేకంగా తన సొంత నిధులను వెచ్చించి పాఠశాలలను స్థాపించి, వారిలో విజ్ఞానపు వెలుగులను నింపిన గిడుగు విశిష్ట సేవలను గుర్తించి ఆంగ్లేయులు రావు బహదూర్ అనే బిరుదును, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణ బిరుదును అందించారని.

నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు రామ్మూర్తిగారికి సహాధ్యాయి అని రామ్మూర్తి పంతులు చేసిన వ్యవహారిక భాషా ఉద్యమానికి వెన్నుదన్నుగా గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం చెల్వపిళ్ల వెంకట శాస్త్రి తదితర ఎంతోమంది ఉద్దండ పండితులు కవులు తమ మద్దతును తెలియజేసి గిడుగు వారికి బాసటగా నిలిచారని నేడు మనం మాట్లాడుతున్న సరళమైన వ్యవహారిక భాషకు మూలం గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన మహోద్యమమే కారణమని ప్రతి ఒక్కరూ తెలుగు భాషను అభిమానించి ప్రేమించి నిత్య వ్యవహారంలో తెలుగును విరివిగా ఉపయోగించాలని సాటి భాషలను ప్రేమించాలని మన తెలుగు భాషను మరువకుండా ప్రతి ఒక్కరూ తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని తెలుగు భాషను బాగా నేర్చుకున్నప్పుడే ఇతర భాషలను మరింత సులభంగా నేర్చుకోగలమని అదే మనము గిడుగు వారికి ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కవిత గుండాల నరేంద్రబాబు, ఎస్కే మస్తాన్, సిహెచ్ నరసింహులు, వాసు కుమార్, ఏడుకొండలు, బి సురేష్, రికార్డ్ అసిస్టెంట్ పి శ్రీనివాసులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story