Sullurupeta: ఎన్డీఏ పాలనలో అభివృద్ధి శూన్యం సూళ్ళూరుపేటలో కాంగ్రెస్ ధ్వజం

Sullurupeta: సూళ్ళూరుపేటలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. ఎన్డీఏ 13 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని, పేపర్ లీకేజీలు, అవినీతిపై తిరగబడతామని కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక.

KKV Sudhakar, Sullurupeta
Published on: 18 Aug 2026 3:16 PM IST
Sullurupeta
X

Sullurupeta: ఎన్డీఏ పాలనలో అభివృద్ధి శూన్యం సూళ్ళూరుపేటలో కాంగ్రెస్ ధ్వజం

Sullurupeta: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 13 సంవత్సరాల పాలనలో దేశంలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరుస పేపర్ లీకులు, రామ మందిరం కుంభకోణాలు మరియు పేద, అణగారిన వర్గాలను అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర పర్యటనలో భాగంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిరణ్ కుమార్ నాయకత్వంలో స్థానిక ఆర్&బి బంగ్లా ప్రాంగణం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​అనంతరం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ జీవివిఎస్ కమలాకరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు మాట్లాడుతూ, దేశంలోగానీ, ఇటు రాష్ట్రంలోగానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. అధికార, ప్రతిపక్ష నాయకులు "దోచుకో, దాచుకో" అనే ఏకైక నినాదంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

​విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వీధిలోకి వచ్చి పోరాటం చేసిన విద్యార్థి లోకం, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. విద్యార్థి ఉద్యమ తీవ్రతకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు గుర్తుచేశారు.

ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story