Nellore: సంక్షేమం, ప్రగతిలో నెల్లూరు నంబర్ వన్ కావాలి: కలెక్టర్ హిమాన్షు!
Nellore: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నెల్లూరు జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలని కలెక్టరేట్ సమీక్షలో కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.
Nellore: సంక్షేమం, ప్రగతిలో నెల్లూరు నంబర్ వన్ కావాలి: కలెక్టర్ హిమాన్షు!
నెల్లూరు: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో, లక్ష్యసాధన దిశగా మరింత చురుగ్గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించిన అంశాలు, జిల్లాలో శాంతి భద్రతలు, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొలుత జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవా రంగం, పరిశ్రమలు, గృహ నిర్మాణం, నీటిపారుదల, మున్సిపాలిటీలు, రహదారుల నిర్మాణం, విద్య, సంక్షేమం తదితర ప్రాధాన్యత రంగాల్లో పనితీరును మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 25 వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు అందించి రాష్ట్రంలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపిన అధికారులను ఆయన అభినందించారు.
అదేవిధంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో కీలకంగా పనిచేసిన రెవెన్యూ అధికారులను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా బీపీసీఎల్ పరిశ్రమకు భూమిపూజ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే సమాయత్తమై సంబంధిత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖ పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు నూటికి నూరు శాతం చేరేలా సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రతి శాఖ పనితీరును మరింత మెరుగుపరచి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ విజయ్ కుమార్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.




