Nellore: అర్జీల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా ఉండాలి కలెక్టర్
Nellore: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.
Nellore: అర్జీల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా ఉండాలి కలెక్టర్
నెల్లూరు: జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.... ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఐటిడిఎ పివో శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన రెడ్డి, మెప్మా, డిఆర్డీఏ పీడిలు కిరణ్ కుమార్, నాగరాజ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ....
ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీ-ఓపెనింగ్‌కు ఆస్కారం లేకుండా నాణ్యతతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి మానవతాదృక్పథంతో పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఫిర్యాదుదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ సమస్యల పరిష్కారంపై ఫీడ్‌బ్యాక్ అందించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి అందే ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సదుపాయం, ఉచిత భోజన ఏర్పాట్లు కల్పించింది. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, అర్జీదారులకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




