Nellore: కలెక్టర్ హిమాన్షు శుక్లాను ప్రత్యేకంగా అభినందించిన సీఎం
Nellore: నెల్లూరు జిల్లా తుమ్మలపెంట ‘మత్స్యకార సేవలో’ బహిరంగ సభలో ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు.
Nellore: కలెక్టర్ హిమాన్షు శుక్లాను ప్రత్యేకంగా అభినందించిన సీఎం
Nellore: శాఖల వారీగా జరిగిన సమీక్షలో అధికారులను అభినందించారు సీఎం చంద్రబాబు.. ఈ నేపథ్యంలో తుమ్మలపెంట గ్రామంలో జరిగిన మత్స్యకార సేవలో కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షిస్తూ, నెల్లూరు జిల్లా పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిందని వెల్లడించారు.
జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రజలు అధిక శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తమ శాఖల పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులను ప్రజల సమక్షంలో అభినందించారు.
ఇరిగేషన్ శాఖ పనితీరు రాష్ట్రంతో పోలిస్తే మెరుగ్గా ఉందని పేర్కొంటూ జిల్లా ఇరిగేషన్ అధికారులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఫైర్ శాఖ అధికారులు సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం విషయంలో అధికారులు మంచి పనితీరు కనబరుస్తున్నారని సీఎం ప్రశంసించారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సేవలందించడంలో బాగా పనిచేస్తున్నారని, యూరియా కొరత లేకుండా రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందించారని సీఎం అభినందించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ కూడా జిల్లాలో బాగుందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.
అంగన్వాడీ ఉద్యోగులు గ్రామీణ స్థాయిలో మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలను సీఎం ప్రశంసించారు. వీధి దీపాల నిర్వహణలో అధికారులు, కాలేజీ యాజమాన్యాలు, బీసీ హాస్టల్స్ అధికారులు, ఆర్టీవో అధికారులు కూడా మెరుగైన పనితీరు కనబరుస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
సామాజిక పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలోనే అత్యధికంగా 91 శాతం ప్రజలు జిల్లాలో సంతృప్తి వ్యక్తం చేశారని, మెరుగైన సేవలు అందిస్తున్న డిఆర్డిఏ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం విశేషమని సీఎం తెలిపారు. అలాగే మిడ్ డే మీల్స్ అమలులో కూడా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు కార్యక్రమం అమలు సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. దేవాలయాలకు తాగునీరు అందించే విషయంలో రాష్ట్ర సగటుతో పోలిస్తే 3 శాతం తక్కువగా ఉందని సీఎం సూచించారు. ఈ అంశంలో అధికారులు మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందని సీఎం పేర్కొన్నారు. రీ సర్వే, ఎఫ్ లైన్ సర్వేలో రాష్ట్రంతో పోలిస్తే జిల్లా ముందంజలో ఉందన్నారు. పాఠశాల విద్యలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. దీపం పథకం అమలులో కూడా జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణను కూడా మరింత మెరుగుపరచాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇదే స్ఫూర్తితో అధికారులు 90 శాతం ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయాలని సీఎం సూచించారు. చాలా శాఖల అధికారులు బాగా పనిచేశారని, కొన్ని శాఖలు పనితీరును ఇంకా మెరుగుపరచుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తున్నామని, జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.




