Atmakur: ఆత్మకూరు 'జగన్ 2.0 యాప్'ను ఆవిష్కరించిన వైసీపీ

Atmakur: ఆత్మకూరులో జగన్ 2.0 యాప్‌ను ప్రారంభించిన వైసీపీ నాయకులు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను నేరుగా అధిష్ఠానానికి చేరవేయడమే యాప్ ప్రధాన లక్ష్యం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 18 July 2026 7:31 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరు 'జగన్ 2.0 యాప్'ను ఆవిష్కరించిన వైసీపీ

ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకే వేదికపైకి తీసుకురావడం, వాటిని నేరుగా పార్టీ అధిష్ఠానం దృష్టికి చేర్చడం లక్ష్యంగా వైఎస్సార్సీపీ రూపొందించిన జగన్ 2.0 యాప్‌ను శనివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘనంగా ఆవిష్కరించారు.

ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మేకపాటి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి నాయకత్వం వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో యాప్‌ను ప్రారంభించి, దాని వినియోగంపై నాయకులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు నందా ఓబులేసు, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరి పులిమి వెంకట రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల తరఫున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా నిరంతరం ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అయితే అలాంటి పోస్టులు తొలగించబడుతున్నాయని, ప్రజల గొంతు నొక్కే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు, పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స్థానికంగా జరుగుతున్న సంఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమాచారం నేరుగా పార్టీ అధిష్ఠానానికి చేరేలా 'జగన్ 2.0' యాప్‌ను వైఎస్సార్సీపీ అభివృద్ధి చేసిందని వివరించారు.

కూటమి ప్రభుత్వ పాలనలో పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో వెంటనే సమాచారం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరి అవసరమైన సహాయం, న్యాయపరమైన మద్దతు, రాజకీయ పరమైన స్పందన అందేలా ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

పార్టీ క్యాడర్ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నమోదు చేసుకునే అవకాశంతో పాటు, ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా యాప్ ద్వారా నేరుగా పంపవచ్చని చెప్పారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో రాజకీయ పార్టీలకు సాంకేతికత కీలకమవుతోందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమాచారాన్ని వేగంగా చేరవేయడం, పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వడం వంటి అంశాల్లో 'జగన్ 2.0' యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రతి నాయకుడు, కార్యకర్త తమ మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సక్రమంగా వినియోగించాలని సూచించారు. పార్టీకి సంబంధించిన సమాచారం, కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, స్థానిక అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

యాప్ ప్రారంభోత్సవం అనంతరం దాని వినియోగ విధానాన్ని నాయకులు వివరించి, ప్రతి ఒక్కరూ ప్రజలకు చేరువయ్యేలా ఈ డిజిటల్ వేదికను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమం పార్టీ నినాదాలు, కార్యకర్తల ఉత్సాహ నినాదాల మధ్య ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల పార్టీ కన్వీనర్ బిజివేముల పిచ్చిరెడ్డి, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఆండ్రా సుబ్బారెడ్డి, తోడేటి సుబ్రమణ్యం, నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగ కన్వీనర్ బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, పట్టణ మైనారిటి అధ్యక్షులు మీరా మొహిద్దీన్, పట్టణ యువత అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరెడ్డి, మాజీ సర్పంచ్ బొలిగర్ల వెంకటేశ్వర్లు, మైనారిటి నాయకులు రహీం, ఎస్సీ సెల్ రూరల్ అధ్యక్షులు తోడేటి అశోక్, నాయకులు బత్తిన నారాయణరెడ్డి, దాడి శ్రీనివాసులునాయుడు, కొండా చిన వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, మస్తాన్ వళీ, ఖాదర్ మస్తాన్, పద్మారెడ్డి, నందవరం ప్రతాప్, యస్థానీ, రఫీ, వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, మల్లెంకొండయ్య, మల్లికార్జున, కుమార్, గోవర్థన్, ఖాజావళి, బాలచెన్నయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story