Atmakur: రూ.40 కోట్లతో పట్టణాభివృద్ధికి ప్రణాళిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Atmakur: ఆత్మకూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి రూ.30 నుంచి రూ.40 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
Atmakur: రూ.40 కోట్లతో పట్టణాభివృద్ధికి ప్రణాళిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు: 2027 మార్చి నాటికి సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కొత్త రూపు తీసుకురావడమే తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.సోమవారం ఆత్మకూరు బైపాస్ రోడ్డు పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
సుమారు 12 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మకూరు శాసనసభ్యుడిగా పనిచేసిన సమయంలో ఆత్మకూరు నెల్లూరు పాలెం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆ రహదారి మరమ్మతులకు రూ.40 లక్షలు విడుదల చేసి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అలాగే ఆత్మకూరు నుంచి సోమశిల వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరగా, ఆయన రూ.5 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సంఘం–కలిగిరి–హసనాపురం మార్గంలో మధ్యలో ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం, అభయాంజనేయ స్వామి ఆలయ భవనానికి శంకుస్థాపన, టిడ్కో కాలనీలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలను త్వరలోనే నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వివిధ పద్దుల కింద మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి వివిధ పద్దుల కింద ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధితో పాటు తాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆత్మకూరు పట్టణానికి సోమశిల నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు ఇప్పటికే ఉన్న పైపులైన్లకు అదనంగా మరో నూతన పైపులైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనలను మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి నూతన పైపులైన్ మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. నూతన పైపులైన్ మంజూరైతే ఆత్మకూరు పట్టణానికి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని మంత్రి పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున నూతన రహదారులు మంజూరు చేశామని, ఈ రహదారులన్నీ పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. రైతుల భూములకు మంచి ధరలు లభించడంతో పాటు రాకపోకలు సులభతరం అవుతాయని చెప్పారు. వాసిలి–వెంకటరావుపల్లి, నాగులపాడు రహదారులు కూడా మంజూరయ్యాయని వెల్లడించారు.
ఆత్మకూరు పట్టణంలో సుమారు 20 ఎకరాల్లో స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ స్టేడియం గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఐటీడీఏ శిక్షణ కళాశాలకు మార్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొత్త భవనాలు నిర్మించి బీసీ గురుకుల పాఠశాల తరగతులను ఆ భవనాల్లో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకు సుమారు ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నూతన రహదారులు, డ్రైన్లు, పార్కుల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, స్టేడియం, ఆధ్యాత్మిక ఆలయాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆత్మకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతినిత్యం కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మంత్రి వెంట వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.




