Atmakur: ఆత్మకూరు రూ.20 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
Atmakur: ఆత్మకూరులో తాగునీటి పైప్‌లైన్ ధ్వంసంపై మంత్రి ఆనం సీరియస్. రూ.20 కోట్లతో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించిన మంత్రి ఆనం.
Atmakur: ఆత్మకూరు రూ.20 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఆత్మకూరు: పట్టణ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించలేరని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు.
గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.ఆత్మకూరు పట్టణానికి సోమశిల నుంచి తాగునీటిని అందించే ప్రధాన పైప్‌లైన్‌ను కొందరు దురుద్దేశపూర్వకంగా బోర్‌వెల్ యంత్రంతో ధ్వంసం చేశారని మంత్రి తెలిపారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
సమాచారం అందిన వెంటనే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రస్తుతం 26 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు.పైప్‌లైన్ ధ్వంసానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారని, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు అత్యవసర చర్యలు చేపట్టామని వెల్లడించారు.తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.89 లక్షలు వెచ్చించామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఆత్మకూరు పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రూ.20 కోట్లతో ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.75 నుంచి రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆత్మకూరు అభివృద్ధిని అడ్డుకోలేరని, అన్ని రంగాల్లో ఆత్మకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఆత్మకూరు మున్సిపల్ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.




