AS Peta: నెల్లూరు ఏఎస్ పేటలో రోడ్లపైనే మురుగునీరు అధికారుల నిర్లక్ష్యం

AS Peta: నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ఏఎస్ పేట దర్గా పరిసరాల్లో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా మారింది.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 19 Jun 2026 11:09 AM IST
AS Peta
X

AS Peta: నెల్లూరు ఏఎస్ పేటలో రోడ్లపైనే మురుగునీరు అధికారుల నిర్లక్ష్యం

ఏఎస్ పేట: ప్రముఖ యాత్ర స్థలంగా విరాజిల్లుతున్న నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలో పారిశుద్ధ్య లోపంతో దుర్గంధ భరితంగా మారింది. కాలువలు చెత్త కుప్పలతో నిండిపోవడంతో తొలగించే నాధుడు లేక మురికి నీరు రోడ్లమీద పారుతున్నాయి. భక్తిశ్రద్ధలతో వెళ్లే భక్తులు మురికి నీరు తొక్కుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలోనే పేరుగాంచిన దర్గాలలో ఒకటైన ఏఎస్ పేటలోని శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి దర్గా ఉన్నది. నిత్యం వేలాదిమంది దర్గాకు వచ్చి వెళుతుంటారు. ఇటీవల పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సైడ్ కాలువ పొంగి ఆ ప్రాంతంలో వీధులలో దుర్గంధం ఏర్పడింది. ప్రస్తుతం ఏఎస్పేట ఉన్నత పాఠశాల వైద్యశాల వసతి గృహం వెళ్లే మార్గంలో ప్రాథమిక పాఠశాల సమీపంలో కాలువ పూడిపోయి మురికి నీరు రోడ్లపై పారుతుంది.

గత పది రోజులకు పైగా మురుగునీరు రోడ్లపై పారుతున్న పంచాయితీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని ఆ ప్రాంతంలోని ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న సైడ్ కాలువ చెత్తకుప్పతో నిండిపోయింది. నిత్యం మండల స్థాయి అధికారులు ఆ ప్రాంతంలో తిరుగుతున్న అటువైపు కన్నెత్తి చూడడం లేదని చూసిన తమకు ఎందుకులే అనుకుంటూ వెళుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

త్వరలో రొట్టెల పండగ

ఈనెల 26 నుంచి నెలాఖరు వరకు నెల్లూరులో స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండగ నిర్వహించనున్నారు. లక్షలాదిమంది రొట్టెల పండుగకు వస్తారు. అక్కడికి వచ్చినవారు ఏఎస్పేట, కసుమూరు దర్గాలను సైతం సందర్శించి వెళ్లడం ఆనవాయితీ. పెద్ద ఎత్తున ఏఎస్ పేటకు యాత్రికులు వచ్చి దర్గాలోని శ్రీ హజరత్ అమ్మాజీలను దర్శించుకుంటారు. అందువల్ల 26వ తేదీ లోపు పారిశుధ్యం పనులు పూర్తిస్థాయిలో చేసి కాలువలు పొంగకుండా పూడికలు తీయించాలని, ప్రత్యేక చర్యలు చేపట్టేలా చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story