Kovvur: ఏఎంసీ పాలకమండలికి అభినందనలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే ప్రశాంతి

Kovvur: వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. రైతులకు అండగా ఉంటామని వెల్లడి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 24 Aug 2026 8:05 AM IST
Kovvur
X

Kovvur: ఏఎంసీ పాలకమండలికి అభినందనలు తెలిపిన ఎంపీ , ఎమ్మెల్యే ప్రశాంతి

Kovvur: కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలో పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ఆ బాధ్యతలకు వంద శాతం న్యాయం చేసి రైతుల నోట, ప్రజల నోట మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.

ఆదివారం సాయంత్రం నార్త్‌రాజుపాళెం మార్కెట్‌ యార్డు వద్ద నిర్వహించిన కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ అభినందన సభలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని నూతన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బెజవాడ వంశీకృష్ణారెడ్డితో పాటు వైస్‌ ఛైర్మన్‌, సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రైతాంగానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

"పదవికి న్యాయం చేసినప్పుడే మంచి పేరు"

ప్రజలు ఆదరించారు కదా అని పదవిలో ఉండి పని చేయకుండా ఉండటం కుదరదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధులు, పదవుల్లో ఉన్నవారు నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే వారి అసలు సమస్యలు తెలుస్తాయని తెలిపారు. ఎంపీగా తాను పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను పలుమార్లు సందర్శించానని, కొన్ని ప్రాంతాల్లో పదిసార్లు కూడా పర్యటించానని పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా ప్రతినిధుల అసలైన బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు ఎంపీగా, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, ఇప్పుడు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ పదవులు కూడా ఆయన ఆశీస్సులతోనే లభించాయని తెలిపారు. ఆ నమ్మకానికి తగినట్లుగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.

కోవూరు డెల్టా ప్రాంతం కావడంతో ఇక్కడ రైతులు అధిక సంఖ్యలో ఉన్నారని, అందువల్ల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీపై మరింత బాధ్యత ఉందని ఎంపీ తెలిపారు. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌,y సభ్యులంతా ఎలాంటి మనస్పర్థలకు తావివ్వకుండా సమష్టిగా పనిచేయాలని సూచించారు. రైతులను నిరంతరం సంప్రదిస్తూ వారి అవసరాలు ఏమిటి, ఏ పనులు చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించి ముందుకు సాగాలని అన్నారు. అదే సమయంలో రైతులు కూడా తమకు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం ఉన్నా వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీని ప్రశ్నించాలని, అడిగి తమకు అవసరమైన పనులు చేయించుకోవాలని సూచించారు.

"అవినీతి రహిత కోవూరే లక్ష్యం"

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఆశీస్సులతో బెజవాడ వంశీకృష్ణారెడ్డికి కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా అవకాశం లభించిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. వైస్‌ ఛైర్మన్‌ పాటూరి రమేష్‌బాబుతో పాటు సభ్యులు ఉడత లక్ష్మి, దాసరి మురళి, బెజ్జం సునీత, చెరుకూరు హరిత, ఈడూరు చెన్నయ్య, పసుపులేటి నాగభూషణం, వేనుంబాక మాధవమ్మ, బెల్లంకొండ రాధ, షేక్‌ జిలాని బాషా, షేక్‌ మొబీన, సింగంశెట్టి లక్ష్మీరాజ్యం, వూసూరుపాటి ప్రసాద్‌, సింహాద్రి శోభితకు అభినందనలు తెలిపారు.

డెల్టా ప్రాంతమైన కోవూరులో వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి రెండేళ్ల తర్వాత వచ్చిందని, ఎప్పుడు పదవి వచ్చినా రైతులకు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. పదవులు లభించినందుకు పార్టీకి, నాయకులకు మంచి పేరు వచ్చేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. గతంలో కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ పనితీరు ఎలా ఉండేదో అందరికీ తెలుసని, ఇకపై ఆ పరిస్థితి పునరావృతం కాకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే అవినీతి రహిత కోవూరును ప్రజలకు అందించడమే తమ బాధ్యత అని అన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ సభ్యులంతా నీతి, నిజాయితీతో పనిచేసి కోవూరు రైతులకు సేవ చేయాలని కోరారు.

"రైతుల డొంక రోడ్ల అవసరాలపై ప్రత్యేక దృష్టి"

వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ప్రమాణ స్వీకారం జరగకముందే పలువురు రైతులు తమకు డొంక రోడ్లు అవసరమని కోరారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. గతంలో వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌కు రైతుల కోసం డొంక రోడ్లు మంజూరు చేసే అధికారం ఉండేదని, గత ప్రభుత్వంలో నిబంధనల్లో మార్పులు జరిగాయని అన్నారు. అయితే రైతుల అవసరాలను ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతుల అవసరాలకు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ద్వారా తప్పకుండా మేలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని, అందరూ సమన్వయంతో పనిచేసి రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర , జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story