Gudur: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

Gudur: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గూడూరులో జరిగిన ఏపీఎంఎఫ్ డివిజన్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Sept 2026 6:29 PM IST
Gudur
X

Gudur: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

Gudur: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.పాశిం సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎంఎఫ్) గూడూరు డివిజన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు పర్చూరు బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, మీడియా ప్రతినిధులు పూర్తి సమాచారం తెలుసుకుని, ఆధారాలతో వార్తలు రాయాలని సూచించారు. రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధుల మధ్య పరస్పర సహృద్భావం ఉండాలని అన్నారు. నూతన కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరంగా లేదా ఇతర ఏ విధమైన సహాయం అవసరమైనా తనను నేరుగా సంప్రదిస్తే తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. గతంలో గూడూరు పట్టణ విలేకరులకు కేటాయించిన ఇంటి స్థలాలకు మున్సిపల్ కమిషనర్ ద్వారా ఇంటి పన్నులు విధించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జర్నలిస్ట్ కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కూడా సహకరిస్తానన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆత్మకూరు సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్‌తో పాటు టీడీపీ నాయకులను ఏపీఎంఎఫ్ నూతన కమిటీ ఘనంగా సన్మానించింది.

ఏపీఎంఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పర్చూరు బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, నూతన కమిటీ సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా జర్నలిస్టులందరి సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేయాలని సూచించారు. అధికారులు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తూ వాస్తవాలను ప్రతిబింబించేలా వార్తలు రాయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా మీడియా ద్వారా అవగాహన కల్పించాలని, చిన్నా–పెద్ద పత్రికలనే తేడా లేకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ గూడూరు డివిజన్ నూతన కమిటీ గౌరవాధ్యక్షులు జయకర్ బాబు, మంగళ పూరి శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బిల్లు చెంచురామయ్య, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ రహీం, గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, ఏఎంసీ డైరెక్టర్ వేమల సునీల్, సీనియర్ నాయకులు వైయస్సార్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్