Windfall Tax Hike : లీటరు డీజిల్‌పై రూ. 14కి చేరిన ఎగుమతి పన్ను.. ఏటీఎఫ్ పై కూడా భారీగా బాదుడు
Windfall Tax Hike : కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ పెంచింది. పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. దేశీయంగా ఇంధన ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
Windfall Tax Hike
Windfall Tax Hike : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూన్ 16 (ఈరోజు) నుంచి వర్తించేలా డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్‌ను పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాబోయే 15 రోజుల పాటు ఈ కొత్త పన్ను రేట్లు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
డీజిల్, ఏటీఎఫ్ పై పెరిగిన ప్రత్యేక సుంకం
కొత్త నిబంధనల ప్రకారం.. దేశం నుంచి వెలుపలికి ఎగుమతి చేసే డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13.5 నుంచి రూ.14కి పెంచారు. అంటే లీటరుకు 50 పైసలు అదనంగా భారం పడనుంది. అదేవిధంగా, విమాన ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే పన్నును లీటరుకు రూ.9.5 నుండి ఏకంగా రూ.12.5కి పెంచడం గమనార్హం. దీనివల్ల విమాన ఇంధన ఎగుమతులు మరింత ప్రియం కానున్నాయి.
సాధారణ వినియోగదారులకు ఉపశమనం
అయితే, ఈ పన్నుల పెంపు వల్ల దేశంలోని సామాన్య వాహనదారులకు ఎలాంటి నష్టం లేదు. స్థానికంగా ఇళ్ల వద్ద ఉండే పెట్రోల్ బంకుల్లో లభించే పెట్రోల్, డీజిల్ దేశీయ వినియోగ ధరలలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత ధరలే కొనసాగుతాయి. అలాగే, పెట్రోల్ ఎగుమతిపై విధించే పన్ను రేటులో కూడా ఎలాంటి మార్పు చేయకుండా దానిని లీటరుకు రూ.1.5 గానే కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
విండ్‌ఫాల్ టాక్స్ సిస్టమ్ ఎందుకు వచ్చింది?
మిడిల్ ఈస్ట్ దేశాలలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మార్చి 26 నుంచి ఈ విండ్‌ఫాల్ టాక్స్ సిస్టమ్‌ను ప్రభుత్వం మళ్లీ దేశంలో అమల్లోకి తెచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, రిఫైనింగ్ మార్జిన్ల హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్రం ఈ ఎగుమతి సుంకాలను సమీక్షిస్తూ మారుస్తూ వస్తోంది. మే 16 న ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై కూడా ఈ ప్రత్యేక పన్నును వర్తింపజేయడం ప్రారంభించింది.
దేశీయ సరఫరాను సురక్షితం చేయడమే లక్ష్యం
భారతదేశంలో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొరత రాకుండా తగినంత స్టాక్ ఉంచడమే ఈ ఎగుమతి సుంకం విధించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, దేశీయ రిఫైనర్లు ఎక్కువ లాభాల కోసం ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి మొగ్గు చూపుతారు. దీనివల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ విండ్‌ఫాల్ టాక్స్ ద్వారా రిఫైనర్లు విదేశీ మార్కెట్లలోని ధరల వ్యత్యాసాన్ని తప్పుగా వాడుకోకుండా అడ్డుకోవచ్చని, తద్వారా దేశీయ ఇంధన భద్రతను కాపాడొచ్చని ప్రభుత్వం తెలిపింది.




