Jaish-e-Mohammed : పోలీస్ డ్రస్‌లో టెర్రర్ ప్లాన్.. ఉగ్రవాది అరెస్ట్.!

Jaish-e-Mohammed : పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు ఒక భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (JeM)

G Krishna
Published on: 2 Aug 2026 11:31 AM IST
Jaish-e-Mohammed
X

Jaish-e-Mohammed 

Jaish-e-Mohammed : పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు ఒక భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమీమ్ మోండల్ అనే అనుమానిత ఉగ్రవాదిని పుర్బా బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఇతడు రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన సీజేపీ (CJP) విద్యార్థుల నిరసన కార్యక్రమంలో అలజడులు సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీస్ యూనిఫామ్‌లో అలజడి సృష్టించేందుకు స్కెచ్

హమీమ్ మోండల్‌ను విచారించిన అనంతరం ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శర్మ విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన ఇతని హ్యాండ్లర్లు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థి నిరసన ప్రదర్శనలోకి పోలీస్ యూనిఫామ్ వేసుకుని ప్రవేశించాలని, అక్కడ పెద్ద ఎత్తున అలజడి, అల్లర్లు సృష్టించాలని హమీమ్‌ను ఆదేశించినట్లు తెలిపారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కదలికలపై నిఘా ఉంచే బాధ్యతను కూడా అతడికి అప్పగించారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేదా పర్యటిస్తున్నప్పుడు భద్రత తక్కువగా ఉంటుందో సమాచారం సేకరించమని అతడికి ఆదేశాలు అందియాయని ఎస్టీఎఫ్ అధికారి వివరించారు.

హనీట్రాప్ డ్రామా.. జార్ఖండ్‌లో ప్రేయసి అరెస్ట్

ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం రోజున హమీమ్ ప్రేయసి అర్పితా సర్కార్‌ను జార్ఖండ్‌లో ఎస్టీఎఫ్ బృందం అరెస్ట్ చేసింది. వీరిద్దరూ కలిసి పాకిస్థాన్‌కు చెందిన 'షెహజాద్ భట్టి' గ్యాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీట్రాప్‌ చేసి, కిడ్నాప్ చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు అధికారులు తెలిపారు.

అర్పితా సర్కార్ రాజకీయ నాయకులు , పలువురు ప్రముఖులను హనీట్రాప్ చేసి, వారి నుండి రహస్య సమాచారాన్ని సేకరించి హమీమ్‌కు చేరవేసేదని పోలీసులు వెల్లడించారు. ఆమె వాట్సాప్ చాట్‌లలో పాకిస్థాన్‌కు చెందిన నంబర్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలు లభించాయి.

యూకే, మెక్సికో సిమ్ కార్డ్స్ లభ్యం..

నిందితుల వద్ద నుంచి యూకే , మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులను ఎస్టీఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లోని తమ హ్యాండ్లర్లు , స్లీపర్ సెల్స్‌తో ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల ద్వారా సీక్రెట్‌గా మాట్లాడేందుకే ఈ సిమ్‌లను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హమీమ్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా.. అతడు సోషల్ మీడియా ద్వారానే తీవ్రవాదం వైపు ఆకర్షితుడై ఉగ్రవాదుల కోసం పనిచేయడం ప్రారంభించినట్లు తేలింది.

పాకిస్థాన్‌లోని 'రాణా', 'ఉజైర్', 'ఆబిద్ జట్ 333', 'హమద్' అనే వ్యక్తులు ఈ షెహజాద్ భట్టి గ్యాంగ్ వెనుక ఉన్నారని, వీరు ప్రధానంగా నార్కో-టెర్రరిజం, ఉగ్ర రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటున్నారని అధికారులు గుర్తించారు. హమీమ్, అర్పితా నాలుగేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం కోర్టు హమీమ్‌ను 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి పంపింది. ఈ ఉగ్ర నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించిందో తెలుసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story