TVK: గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు.. సీఎంగా 'దళపతి' విజయ్ పట్టాభిషేకం ఎప్పుడంటే?
TVK: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం. టీవీకే పార్టీకి మేజిక్ ఫిగర్ కంటే 10 సీట్లు తక్కువ రావడంతో కాంగ్రెస్ మద్దతు కోసం చర్చలు. ఎమ్మెల్యేల రిసార్ట్ తరలింపుతో తమిళ రాజకీయాల్లో హైడ్రామా.
TVK: గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు.. సీఎంగా 'దళపతి' విజయ్ పట్టాభిషేకం ఎప్పుడంటే?
TVK: రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్.. ప్రమాణస్వీకారం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ లేఖ రాశారు. అయితే.. లేఖను లోక్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా పంపించారు. ఇదే విషయంపై ఇవాళ తమిళనాడు గవర్నర్‌తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం-టీవీకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ భేటీ కాగా.. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా విజయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ అభ్యర్థులు.
టీవీకే తమిళనాడులో అనూహ్య విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై పార్టీ నేతలతో విజయ్ చర్చించినట్టు తెలుస్తోంది. టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సుముఖంగా ఉన్నప్పటికీ.. దీనిపై విజయ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించాలని విజయ్ నిర్ణయించుకున్నారు. అందుకోసం మహాబలిపురంలోని ఓ రిసార్టును విజయ్ బుక్ చేసినట్టు తెలుస్తోంది.




