Vehicle Number Plate Rules in India: వాహనాల నంబర్‌ప్లేట్‌ రహస్యాలు...నియమాలు తప్పితే భారీ శిక్ష

Vehicle Number Plate Rules in India: నంబర్‌ ప్లేట్‌ లేకుండా ఏ వాహనం కూడా రోడ్డుపైకి రాకూడదు. ప్రతీ వాహనానికి నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి. ఇది కేవలం గుర్తింపుకోసం కాదు.

Balachander
Published on: 9 April 2026 10:32 AM IST
Vehicle Number Plate Rules in India
X

Vehicle Number Plate Rules in India

Vehicle Number Plate Rules in India: నంబర్‌ ప్లేట్‌ లేకుండా ఏ వాహనం కూడా రోడ్డుపైకి రాకూడదు. ప్రతీ వాహనానికి నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి. ఇది కేవలం గుర్తింపుకోసం కాదు. వాహనం ఉపయోగం, వర్గం, ప్రత్యేక హోదా వంటి వివరాలను తెలియజేసే కోడ్‌ లాంటిది. రంగు, అక్షరాల స్టైల్‌, చిహ్నాలు అన్ని కలిపి ఆ వాహనం గురించిన పూర్తి సమాచారం ఇస్తాయి. అయితే, కొంతమంది ఈ నియమాలను ఉల్లంఘించి నంబర్‌ ప్లేట్‌లో ఆటలాడుతూ చట్టాల నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అలాంటి వారికి భారీ జరిమానాలు, శిక్షలు తప్పవని గుర్తుపెట్టుకోవాలి.

తెలుపురంగు ప్లేట్‌

సాధారణంగా మనకు ఎక్కువగా కనిపించేది తెలుపు రంగు నంబర్‌ప్లేట్. దీనిపై నలుపు అక్షరాలు ఉంటాయి. ఇవి పూర్తిగా వ్యక్తిగత వాహనాల కోసం మాత్రమే. ఈ వాహనాలను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే అది చట్టవిరుద్ధం. ఒకసారి పట్టుబడితే రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డ్రైవర్‌ లైసెన్స్‌కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది.

పసుపురంగు ప్లేట్‌

పసుపు రంగు ప్లేట్ కమర్షియల్ వాహనాల గుర్తు. టాక్సీలు, ఆటోలు, బస్సులు, ట్రక్కులు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ వాహనాలకు ప్రత్యేక పర్మిట్, కమర్షియల్ లైసెన్స్ అవసరం. నియమాలు పాటించకపోతే రూ.10,000 వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది.

నలుపురంగు ప్లేట్‌

ఇక నల్లటి ప్లేట్‌పై పసుపు అక్షరాలు ఉంటే అవి రెంటల్ వాహనాలు. జూమ్‌కార్ లాంటి సంస్థలు ఈ వాహనాలను వినియోగిస్తాయి. ఇవి కమర్షియల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నప్పటికీ, సాధారణ వ్యక్తి కూడా డ్రైవ్ చేయవచ్చు.

గ్రీన్‌ అండ్‌ రెడ్‌

పర్యావరణాన్ని కాపాడే ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ నంబర్‌ప్లేట్ ఉంటుంది. ఇందులో కూడా రెండు రకాలున్నాయి. ప్రైవేట్ ఈవీలకు తెలుపు అక్షరాలు, కమర్షియల్ ఈవీలకు పసుపు అక్షరాలు ఉంటాయి. ప్రభుత్వం ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు టోల్ రాయితీలు, సబ్సిడీలు కూడా ఇస్తోంది.

ఎరుపు రంగు నంబర్‌ప్లేట్ తాత్కాలికంగా వాహనానికి ఇస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి శాశ్వత రిజిస్ట్రేషన్ వచ్చే వరకు ఇది వాడతారు. సాధారణంగా దీని గడువు 30 రోజులు మాత్రమే. అయితే రాష్ట్రపతి, గవర్నర్ వాహనాలపై ఎరుపు ప్లేట్‌తో పాటు జాతీయ చిహ్నం ఉంటుంది.

బ్లూ అండ్‌ ఆర్మీ వెహికిల్స్‌

నీలం రంగు నంబర్‌ప్లేట్ విదేశీ రాయబార కార్యాలయాలకు చెందిన వాహనాలకు ఇస్తారు. వీటిపై ‘CC’, ‘DC’, ‘UN’ వంటి కోడ్‌లు కనిపిస్తాయి. ఇవి ప్రత్యేక హోదాను సూచిస్తాయి.

అదేవిధంగా సైనిక వాహనాలపై మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. నంబర్ ప్రారంభంలో పైకి చూపించే బాణం గుర్తు ఉంటుంది. ఇవి సాధారణ ఆర్టీఓ పరిధిలోకి రావు. రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక నంబరింగ్ విధానం ఉంటుంది. వీటిని రోడ్డుపై ఆపే అధికారం సాధారణ పోలీసులకు ఉండదు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘BH సిరీస్’ కూడా చాలా ఉపయోగకరంగా మారింది. తరచూ రాష్ట్రాలు మారే ఉద్యోగులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే దేశవ్యాప్తంగా అదే నంబర్‌తో వాహనం నడపవచ్చు.

అయితే కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు నంబర్‌ప్లేట్‌ను మార్చడం, అక్షరాలను స్పష్టంగా కనిపించకుండా చేయడం, ఫ్యాన్సీ ఫాంట్‌లను వాడడం వంటి తప్పులు చేస్తున్నారు. ఇది మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 నుంచి రూ.20,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనాన్ని సీజ్ చేయడానికీ అధికారులు వెనుకాడరు.

మొత్తంగా చూసుకుంటే...నంబర్‌ప్లేట్ ఒక చిన్న విషయం అనిపించినా… అది చట్టపరంగా చాలా కీలకం. సరైన ప్లేట్, సరైన విధంగా ఉండటం ప్రతి వాహనదారుడి బాధ్యత. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. రూల్స్‌ను పాటిస్తూ డ్రైవింగ్‌ చేయడం చట్టపరంగానే కాదు...మనకు రక్షణగా కూడా ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story