Ganja Seized : ఎయిర్‌పోర్ట్‌లో డ్ర*గ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు.. ఏకంగా రూ.19 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్
Ganja Seized : వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుండి వచ్చిన ఆరుగురు థాయిలాండ్ నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19 కోట్ల విలువైన 19.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Varanasi Airport
Ganja Seized : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం (బాబత్‌పూర్ ఎయిర్పోర్ట్) వేదికగా జరుగుతున్న ఒక భారీ అంతర్జాతీయ డ్ర*గ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా ఛేదించారు. బ్యాంకాక్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా విమానంలో కోట్లాది రూపాయల విలువైన డ్ర*గ్స్‌ను తరలిస్తున్న థాయిలాండ్ దేశానికి చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను ఎయిర్పోర్ట్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లభించిన నిషేధిత డ్ర*గ్స్ విలువ మార్కెట్లో మైండ్ బ్లాకింగ్ రేంజ్లో ఉందని అధికారులు వెల్లడించారు.
శనివారం నాడు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు కొంతమంది ప్రయాణికులు వచ్చారు. వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్న థాయిలాండ్ దేశస్థుల బ్యాచ్ కూడా ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకు వీరి ప్రవర్తనపై తీవ్ర అనుమానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సెక్యూరిటీ సిబ్బంది వారిని ప్రత్యేకంగా పక్కకు పిలిచి సోదాలు చేయడం ప్రారంభించారు.
అధికారులు సదరు థాయిలాండ్ ప్రయాణికుల ట్రోలీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. దుస్తుల మధ్యలో చాలా ప్లాన్డ్గా దాచిపెట్టిన వివిధ ప్లాస్టిక్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆ ప్యాకెట్లను విప్పి చూడగా అందులో ఏకంగా 19.7 కిలోల బరువున్న అత్యంత నాణ్యమైన గంజాయి లభించింది. అంతర్జాతీయ నల్లబజారులో ఈ స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.19 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు లెక్కగట్టారు.
ఏమిటీ హైడ్రోపోనిక్ గంజాయి?
కస్టమ్స్ అధికారులు పట్టుకున్న డ్ర*గ్స్ సాధారణ గంజాయి కాదు. దీనిని హైడ్రోపోనిక్ గంజాయి అని పిలుస్తారు. ఇది గంజాయి మొక్కల రకాలలోనే అత్యంత శక్తివంతమైనది.. అధికంగా మత్తును ఇచ్చేది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ మొక్కలను సాధారణ భూమిలో లేదా మట్టిలో పెంచరు. కేవలం నీరు, ప్రత్యేక పోషకాలతో కూడిన ఒక అధునాతన ల్యాబ్ తరహా సిస్టమ్‌లో ఈ మొక్కలను సాగు చేస్తారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్, ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
కోల్‌కతా, గయా రూట్లలో ముందే స్మగ్లింగ్
డ్ర*గ్స్ పట్టుబడిన తర్వాత పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఆరుగురు థాయిలాండ్ నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ క్రమంలో వారు కొన్ని నమ్మలేని నిజాలను ఒప్పుకున్నారు. తాము ఇండియాకు డ్ర*గ్స్ తీసుకురావడం ఇది మొదటిసారి కాదని.. గతంలో కూడా కోల్‌కతా, గయా రూట్ల ద్వారా భారతదేశంలోకి సక్సెస్‌ఫుల్‌గా మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసినట్లు నిందితులు నోరు విప్పారు.
థాయ్ లేడీ హ్యాండ్.. జైలుకు నిందితులు
ఈ అంతర్జాతీయ డ్ర*గ్స్ రాకెట్ వెనుక థాయిలాండ్‌కు చెందిన మరో కింగ్‌పిన్ మహిళ హ్యాండ్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించి ఆ కోణంలో కూడా విచారణ ముమ్మరం చేశాయి. పట్టుబడిన ఆరుగురు నిందితులను పోలీసులు స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయపరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో వారిని జైలుకు తరలించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న మిగతా పెద్ద తలకాయలను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.




