Vande Bharat Sleeper: ప్రయాణికులకు అదిరిపోయే అప్‌డేట్.. రెండో వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది
Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలుపై రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు-ముంబై మధ్య రెండో రైలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో 16 గంటల్లోనే ప్రయాణం పూర్తి అవుతుంది.
Vande Bharat Sleeper
Vande Bharat Sleeper: వందే భారత్ రైళ్ల హవా ఇక రాత్రి ప్రయాణాల్లోనూ మొదలుకాబోతోంది. ఇప్పటికే చైర్ కార్ సర్వీసులతో రికార్డులు సృష్టిస్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు, ఇప్పుడు స్లీపర్ కోచ్‌లతో ప్రయాణికులను పలకరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా, ఇప్పుడు రెండో స్లీపర్ రైలుకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు. దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లపై విపరీతమైన క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో, రెండో సర్వీసును బెంగళూరు - ముంబై మధ్య నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ ఎంపీ మోహన్‌కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లేఖ రాస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించాలంటే సాధారణ రైళ్లలో దాదాపు 22 గంటల సమయం పడుతోంది. అయితే వందే భారత్ స్లీపర్ రాకతో ఈ సమయం కేవలం 16 గంటలకు తగ్గిపోనుంది. అంటే ప్రయాణికులకు దాదాపు 6 గంటల సమయం ఆదా అవుతుంది.
తొలి రైలు సక్సెస్.. రెండో రైలుపై ఆశలు
దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును 2026 జనవరి 17న హౌరా నుంచి గువహతి మధ్య ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన రావడమే కాకుండా, దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. దీంతో రెండో రైలును అత్యంత రద్దీగా ఉండే బెంగళూరు-ముంబై రూట్ లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. త్వరలోనే ఈ రైలుకు సంబంధించిన టైమ్ టేబుల్, ప్రారంభ తేదీ, టికెట్ ధరలను అధికారికంగా వెల్లడించనున్నారు.
ఫ్లైట్ లాంటి సౌకర్యాలు
వందే భారత్ స్లీపర్ రైలు ఫీచర్లు విమానానికి ఏమాత్రం తక్కువ కావు. గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో మొత్తం 16 ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, మెరుగైన కుషనింగ్ ఉన్న సీట్లు, వాక్యూమ్ ఆధారిత అత్యాధునిక టాయిలెట్లు, హై-క్వాలిటీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. విశేషమేమిటంటే, ఈ రైలులో ప్రయాణించే వారికి టికెట్ ధరలోనే ఉచితంగా భోజనం అందిస్తారు. దీంతో ప్రయాణికులు ఆహారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ఎంట్రీ
సాధారణ రైళ్లలా కాకుండా, వందే భారత్ స్లీపర్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉండనున్నాయి. ఈ రైలులో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులను అనుమతించరు. అంతేకాకుండా, ఆర్‌ఏసీ (RAC) టికెట్ ఉన్నవారికి కూడా ప్రయాణం చేసే అవకాశం ఉండదు. కేవలం కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికే అనుమతి ఉంటుంది. దీనివల్ల ప్రయాణం ఎంతో ప్రశాంతంగా, రద్దీ లేకుండా సాగుతుంది. కనీస ఛార్జీ సుమారు రూ.960 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. దూరపు ప్రయాణాలను విలాసవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ ఈ కొత్త రైలును త్వరలోనే పట్టాలెక్కించనుంది.




