Aadhaar: ఆధార్‌లో ఈ-మెయిల్ ఐడీ.. ఫ్రీగా ఇలా అప్‌డేట్ చేసుకోండి

Aadhaar: ఆధార్ కార్డ్ వినియోగదారులకు యుఐడీఏఐ ఒక అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Ravi
By Ravi
Published on: 4 July 2026 6:57 AM IST
Aadhaar
X

Aadhaar: ఆధార్‌లో ఈ-మెయిల్ ఐడీ.. ఫ్రీగా ఇలా అప్‌డేట్ చేసుకోండి

Aadhaar: భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకింగ్ సేవల వరకు అన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో, ఆధార్ కార్డులో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. తాజాగా, ఆధార్ కార్డును జారీ చేసే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వినియోగదారుల కోసం ఒక సరికొత్త, ఉచిత సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

దీని ద్వారా ఎవరైనా తమ కొత్త ఆధార్ మొబైల్ యాప్ సహాయంతో ఎటువంటి రుసుము చెల్లించకుండా ఇంట్లోనే కూర్చుని తమ ఈమెయిల్ ఐడీని సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఆఫర్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ ఉచిత సదుపాయం అందుబాటులోకి వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఈమెయిల్ ఐడీలను విజయవంతంగా మార్చుకున్నారు లేదా కొత్తగా లింక్ చేసుకున్నారు.

ఈ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారులు ముందుగా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం యాప్‌లో కనిపించే 'సర్వీసెస్' సెక్షన్‌కు వెళ్లి, అక్కడ ఉన్న 'ఈమెయిల్ ఐడీ' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు లింక్ చేయాలనుకుంటున్న కొత్త ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయగానే, ఆ మెయిల్‌కు ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఆ ఓటీపీని యాప్‌లో నమోదు చేసి వెరిఫై చేయాలి.

చివరి దశగా, మీ మొబైల్ కెమెరా ద్వారా 'ఫేస్ అథెంటికేషన్'ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగియగానే మీ ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ అభ్యర్థన పూర్తవుతుంది. సాధారణంగా ఆధార్ కేంద్రాల్లో లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఇలాంటి మార్పులు చేయడానికి కొంత ఫీజు వసూలు చేస్తారు, కానీ కొత్త యాప్ ద్వారా ఈ సేవను రాబోయే 6 నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు యూఐడీఏఐ స్పష్టం చేసింది. కాబట్టి ఆధార్‌లో మెయిల్ ఐడీ అప్‌డేట్ లేనివారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story