మహారాష్ట్ర, బెంగాల్‌ను మరిచిపోండి.. మొత్తం సమాజ్‌వాదీ పార్టీనే బీజేపీలో విలీనం కాబోతోంది: యూపీ మంత్రి
Om Prakash Rajbhar: ఉత్తరప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
మహారాష్ట్ర, బెంగాల్‌ను మరిచిపోండి.. మొత్తం సమాజ్‌వాదీ పార్టీనే బీజేపీలో విలీనం కాబోతోంది: యూపీ మంత్రి
Om Prakash Rajbhar: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) టార్గెట్‌గా యూపీ పంచాయతీ రాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీలో భారీ చీలిక రాబోతుందని, ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరేందుకు లైన్ లో ఉన్నారంటూ ఆయన చేసిన ట్వీట్‌ను తాజాగా సమర్థించుకున్నారు.
ఈ వ్యవహారంపై ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఓం ప్రకాష్ రాజ్‌భర్.. "సమాజ్‌వాదీ పార్టీ మొత్తం బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంది. ఇది వంద శాతం నిజం. రాజ్‌భర్ ఏది చెప్పినా ధైర్యంగా, నిజాయితీగా చెబుతారు" అని స్పష్టం చేశారు. అయితే బీజేపీలోకి వెళ్లే ఆ నేతల పేర్లు ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "ఇప్పుడే అందరి పేర్లు బయటపెడితే, ఆ ప్రయత్నమంతా వృథా అవుతుంది. కాస్త ఓపిక పట్టండి, కొన్ని రోజులు వేచి చూస్తే మీకే తెలుస్తుంది" అంటూ రాజ్‌భర్ సస్పెన్స్ స్క్రీన్ ప్లే నడిపారు.
అంతకుముందు ఆయన హిందీలో చేసిన ట్వీట్‌లో ఎస్పీ అగ్రనేత రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ సమర్పించారని ఆరోపించారు. యూపీని కుదిపేసిన మైనింగ్ స్కామ్, గోమతీ నదీ తీర అభివృద్ధి (గోమతీ రివర్ ఫ్రంట్) కుంభకోణాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసని.. చట్టం ఉచ్చు బిగుసుకుంటుండటంతోనే ఎస్పీ నేతల్లో ఆందోళన మొదలైందని, అందుకే వారు బీజేపీ వైపు చూస్తున్నారని రాజ్‌భర్ విమర్శించారు.
ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉన్న 63 ఏళ్ల రాజ్‌భర్‌కు గతంలో సమాజ్‌వాదీ పార్టీతో మంచి సంబంధాలు ఉండేవి. గత 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అఖిలేష్ యాదవ్‌కు చెందిన ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో పోటీ చేసిన రాజ్‌భర్ పార్టీ ఆరు సీట్లలో విజయం సాధించింది. అయితే ఫలితాలు వచ్చిన కొద్ది నెలలకే అఖిలేష్‌తో విభేదాల కారణంగా సంబంధాలు తెంచుకున్న రాజ్‌భర్.. ఆ తర్వాత తిరిగి ఎన్డీఏ గూటికి చేరి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పాత మిత్రుడిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు యూపీ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి.




