Lock Down: లాక్‌డౌనా..?ఛాన్సేలేదు.. తేల్చేసిన కేంద్ర మంత్రులు!

Lock Down: ప్రస్తుతం నెల్లకొన్న యుద్ధ పరిస్థితుల్లో మన దేశంలో లాక్‌డౌన్ విధించవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రులు ఖండించారు.

KVD Varma
Published on: 27 March 2026 2:30 PM IST
Lock Down: ప్రస్తుతం నెల్లకొన్న యుద్ధ పరిస్థితుల్లో మన దేశంలో లాక్‌డౌన్
X

Lock Down

Lock Down: పశ్చిమ ఆసియాలో సంక్షోభం వలన మన దేశంలో లాక్‌డౌన్‌ రావచ్చంటూ జరుగుతున్న ప్రచారాన్ని ముగ్గురు కేంద్ర మంత్రులు ఖండించారు. ఇవి కేవలం వదంతులు మాత్రమేనని ముగ్గురు సీనియర్ మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, హర్దీప్ పూరి ప్రకటనలు విడుదల చేశారు. ప్రధాని మోదీ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారనీ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రిజుజు చెప్పారు.

ఇదే విషయంపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ "భయానక వాతావరణాన్ని సృష్టించవద్దు. లాక్‌డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు" అని అన్నారు. నాలుగు రోజుల క్రితం పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన ప్రకటన తర్వాత లాక్‌డౌన్ వదంతులు మొదలయ్యాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితి దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉందని ప్రధాని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా మనం ఇటువంటి సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. దీంతో మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి ఈ సాయంత్రం ముఖ్యమంత్రులందరితో మాట్లాడనున్నారు.

లాక్‌డౌన్ పై మంత్రులు ఏమన్నారంటే..

ఇది పూర్తిగా వదంతి, ఆందోళన చెందవద్దు: రిజిజు

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, "ఈ వదంతులను ఎవరు వ్యాప్తి చేస్తున్నారు? ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు. ఆయన హోర్డింగ్‌లు ఏర్పాటు చేసేవారిని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు హోర్డింగ్‌లు పెట్టవద్దని ఆయన ఆదేశించారు. భారత ప్రభుత్వం మొత్తం పరిస్థితిని అదుపులో ఉంచింది. సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ఉన్నత స్థాయి నుండి కింది స్థాయి వరకు, స్వయంగా ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు." అని చెప్పారు.

బాధ్యతారాహిత్యం: హర్దీప్ పూరి

లాక్‌డౌన్‌పై ప్రచారంలో ఉన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. "ప్రభుత్వ స్థాయిలో అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఇలాంటి సమయంలో మనమందరం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వదంతులు వ్యాప్తి చేయడం, అనవసర భయాన్ని సృష్టించడం బాధ్యతారాహిత్యం" అని ఆయన అన్నారు.

లాక్‌డౌన్ ఉండదని నాకు గట్టి నమ్మకం: నిర్మలా సీతారామన్ అన్నారు.

"లాక్‌డౌన్, ఇంధన కొరత ఏర్పడుతుందని కొందరు నాయకులు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇవి నిరాధారమైన వాదనలు. రాజకీయ రంగంలోని వ్యక్తుల నుండి ఇలాంటి ప్రకటనలు రావడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ సమయంలో మనం చూసినటువంటి లాక్‌డౌన్ ఉండదు. కోవిడ్ సమయంలో మనం చూసినటువంటి లాక్‌డౌన్ ఉండదని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను," అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

మొత్తంమీద లాక్‌డౌన్ వార్తల్లో నిజం లేదని కేంద్ర మంత్రుల ప్రకటనతో అర్ధం అవుతోంది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story