TVK : సీఎం విజయ్‌కు షాక్.. టీవీకే మంత్రులకు లీగల్ నోటీసులు.!

TVK : తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార తమిళగ వెట్రి కజగం (TVK), ప్రతిపక్ష డీఎంకే (DMK) మధ్య సవాల్-ప్రతిసవాళ్లతో పొలిటికల్ వార్ పీక్స్‌కు

G Krishna
Published on: 29 Jun 2026 11:01 AM IST
TVK-Vijay
X

TVK-Vijay

TVK : తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార తమిళగ వెట్రి కజగం (TVK), ప్రతిపక్ష డీఎంకే (DMK) మధ్య సవాల్-ప్రతిసవాళ్లతో పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. తాజాగా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కేబినెట్‌లోని ఇద్దరు కీలక మంత్రులకు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ అల్లుడు వి. శబరీశన్ లీగల్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీవీకే మంత్రులు ఆధవ్ అర్జున, నిర్మల్ కుమార్‌లపై ఆయన న్యాయపరమైన చర్యలకు దిగారు.

16 శాఖల్లో అవినీతి అంటూ ఆరోపణలు

వేర్వేరు ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో టీవీకే మంత్రులు చేసిన వ్యాఖ్యలపై శబరీశన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ బోర్డు (EB) కొనుగోళ్ల ప్రక్రియలో శబరీశన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపించగా.. మరో మంత్రి ఆధవ్ అర్జున ఒకడుగు ముందుకు వేసి ఏకంగా 16 ప్రభుత్వ శాఖల్లో శబరీశన్ అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శబరీశన్.. అవి పూర్తిగా తప్పుడు, ఆధారాలు లేని, తన ప్రతిష్టను భంగపరిచే వ్యాఖ్యలని పేర్కొన్నారు. తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రులను నోటీసుల్లో హెచ్చరించారు.

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు: స్టాలిన్ సంచలనం

మంత్రులకు నోటీసులు అందిన తరుణంలోనే డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అధికార టీవీకే ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఒంటరిగా పాలించే మెజార్టీ లేదని, ఐదేళ్ల పదవీకాలాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయడం అసాధ్యమని హింట్ ఇచ్చారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు అవసరం కాగా.. టీవీకే కేవలం 108 సీట్లే గెలుచుకుందని స్టాలిన్ గుర్తుచేశారు. నిన్నటివరకు డీఎంకే కూటమిలో ఉండి, చివరి నిమిషంలో ప్లేట్ మార్చిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతోనే విజయ్ వాహనం నడుస్తోందని ఎద్దేవా చేశారు.

ఎప్పుడైనా ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి!

ప్రస్తుత విజయ్ ప్రభుత్వం అత్యంత అస్థిరంగా ఉందన్న స్టాలిన్.. ఈ ‘టీవీకే వాహనం’ ఏ మలుపులో బ్యాలెన్స్ తప్పి ఆగిపోతుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. "నేను మీకు చెప్తున్నాను.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. మూడు నెలల్లో రావచ్చు లేదా ఆరు నెలల్లో రావచ్చు. మనం ఐదేళ్ల వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఎలాంటి రాజకీయ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు డీఎంకే శ్రేణులు 100 శాతం సిద్ధంగా ఉండాలి" అని పిలుపునిచ్చారు.

ఇటీవల వైకోకు చెందిన ఎండీఎంకే (MDMK) కూడా డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. స్టాలిన్ అల్లుడు శబరీశన్ నేరుగా మంత్రులపైనే లీగల్ నోటీసులతో విరుచుకుపడటం తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం విజయ్ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story