Rahul Bansal: "అప్పుడు రూ.500కే బాధపడ్డారు.. ఇప్పుడు రూ.కోటి కొట్టేశారు".. వైరలవుతున్న ఐపీఎస్ రాహుల్ వీడియా!

Rahul Bansal: మాక్ ఇంటర్వ్యూలో లంచగొండితనంపై నీతులు చెప్పిన ట్రైనీ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సాల్.. సైబర్ కేసు సెటిల్‌మెంట్‌లో రూ.కోటి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 2:33 PM IST
Rahul Bansal
X

Rahul Bansal: "అప్పుడు రూ.500కే బాధపడ్డారు.. ఇప్పుడు రూ.కోటి కొట్టేశారు".. వైరలవుతున్న ఐపీఎస్ రాహుల్ వీడియా!

Rahul Bansal: సివిల్ సర్వీసెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఒక పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగితే తీవ్రంగా బాధపడిన ఓ వ్యక్తి.. ఐపీఎస్ అధికారిగా మారిన తర్వాత ఏకంగా రూ.కోటి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండటం సంచలనంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ బన్సాల్‌ వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కారు.

ఐపీఎస్‌గా ఎంపికైన అనంతరం రాహుల్‌ బన్సాల్‌ ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో సీఎస్పీగా (CSP) బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఓ సైబర్‌ నేరానికి సంబంధించిన వ్యవహారాన్ని క్లోజ్ చేసేందుకు ఆయన రూ.కోటి లంచం డిమాండ్ చేసి, రెండు దఫాలుగా ఆ మొత్తాన్ని తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వాట్సప్‌ చాట్లు, డిజిటల్‌ లావాదేవీల ఆధారాలను బాధితులు దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు.. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను ఆదేశించింది.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సివిల్స్ సాధించకముందు రాహుల్ బన్సాల్ ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "మా సోదరుడు అమెరికా వెళ్లేందుకు బర్త్ సర్టిఫికేట్ త్వరగా కావాల్సి వస్తే పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగారు. ఆ డబ్బు ఇవ్వాల్సి రావడం నాకు చాలా బాధ కలిగించింది" అని రాహుల్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, సమాజంలో అవినీతి, అధికారుల అసమర్థతపై గొప్పగా మాట్లాడారు.

ఒకప్పుడు రూ.500 లంచం ఇస్తేనే బాధపడిన వ్యక్తి, ఉద్యోగం వచ్చాక రూ.కోటి నొక్కేశారన్న వార్తలతో నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే, ఈ వ్యవహారంపై ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story