రీల్స్ రచ్చ: కోడలి వేధింపులు భరించలేక అత్తమామల ఆత్మహత్య!
Haryana: హరియాణాలోని పానిపట్ జిల్లాలో విషాదం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, పొట్టి దుస్తుల విషయంలో తలెత్తిన వివాదంతో అత్తమామలు ఆత్మహత్య.
రీల్స్ రచ్చ: కోడలి వేధింపులు భరించలేక అత్తమామల ఆత్మహత్య!
Haryana: సోషల్ మీడియా వ్యామోహం పుచ్చిన విషం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం, పొట్టి దుస్తులు ధరించడం వంటి విషయాల్లో తలెత్తిన కుటుంబ కలహాలు అత్తమామల ఆత్మహత్యకు దారితీసిన హృదయ విదారక ఘటన హరియాణాలోని పానిపట్ జిల్లా నారా గ్రామంలో వెలుగుచూసింది.
నారా గ్రామానికి చెందిన రాజేష్ (46), సుమన్ (44) దంపతుల కుమారుడు ఆశిష్, ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరికీ 2025 జనవరిలో వివాహం జరిగింది. అయితే, స్నేహకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే విపరీతమైన ఇష్టం. పెళ్లి తర్వాత కూడా ఆమె పొట్టి దుస్తులు ధరించి రీల్స్ చేయడం పట్ల అత్తమామలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కుటుంబంలో నిత్యం గొడవలు మొదలయ్యాయి.
ఈ వివాదంలోకి కోడలు స్నేహ కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, సోదరి) కూడా ప్రవేశించడంతో పరిస్థితి మరింత దిగజారింది. స్నేహ తన అత్తమామలను శారీరకంగా, మానసికగా వేధించడమే కాకుండా పలుమార్లు వారిపై చేయి చేసుకుందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ అవమానం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన రాజేష్, సుమన్ దంపతులు మే 9న విషం తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమన్ మొదట, ఆ తర్వాత ఆదివారం ఉదయం రాజేష్ ప్రాణాలు విడిచారు.
మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కోడలు స్నేహతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు నలుగురూ పరారీలో ఉండటంతో పోలీసులు వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. గ్రామస్తులు మరియు మృతుల బంధువులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




