Tiruvannamalai: అరుణాచలం గిరి ప్రదక్షిణ బాటలో దారుణం.. ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం!

Tiruvannamalai: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం) గిరి ప్రదక్షిణ బాటలో దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 4 Jun 2026 10:48 AM IST
Tiruvannamalai
X

Tiruvannamalai: అరుణాచలం గిరి ప్రదక్షిణ బాటలో దారుణం.. ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం!

Tiruvannamalai: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం)లో అత్యంత దారుణమైన ఘటనలు వెలుగుచూశాయి. పవిత్రమైన గిరి ప్రదక్షిణ బాట సమీపంలో వేర్వేరు చోట్ల ఇద్దరు యువతులపై ఒక కామాంధుల ముఠా సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడింది. బాధితులను నగ్నంగా వీడియోలు తీసి, డబ్బులు, బంగారం లాక్కుని వేధించిన ఈ దారుణ ఉదంతంలో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి మే 30న పౌర్ణమి గిరి ప్రదక్షిణ కోసం తిరువణ్ణామలై వచ్చారు. ఆ రాత్రి ప్రదక్షిణ ముగించుకుని బైక్‌లపై తిరుగుప్రయాణమయ్యారు. దారిలో పెద్దకోలాపాడి వద్ద సదరు వివాహిత, ఆమె స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మారణాయుధాలతో వచ్చిన ఒక దుండగుల ముఠా వారిని బెదిరించి, బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ వివాహితపై ముఠా సభ్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం బాధితుల దుస్తులు లాక్కొని నగ్నంగా వీడియోలు తీశారు. మరుసటి రోజు ఆ వీడియోను వివాహిత మొబైల్‌కు పంపి రూ. లక్ష ఇవ్వాలని, లేదంటే సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో భయపడిన ఆమె రూ. 4 వేలు గూగుల్ పే చేసి, ధర్మపురి పోలీసులను ఆశ్రయించింది.

ఇది జరిగిన మరుసటి రోజే అంటే మే 31న తిరువణ్ణామలై మున్సిపాలిటీకి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తోంది. అర్ధరాత్రి సమయంలో కాళ్ల నొప్పులు రావడంతో అడిఅన్నామలై గ్రామం వద్ద కూర్చుని, తన స్నేహితుడికి ఫోన్ చేసి రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరూ కలిసి అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లగా.. అక్కడ పొంచివున్న అదే ముఠా వారిని మళ్లీ బెదిరించి అడవిలోకి లాసుకెళ్లింది. యువతిని, ఆమె స్నేహితుడిని దారుణంగా చిత్రహింసలు పెట్టి, యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వారిని కూడా నగ్నంగా వీడియో తీసి, యువతి చెవిలో ఉన్న 2 గ్రాముల బంగారు కమ్మలను లాక్కుని పారిపోయారు.

బ్యాక్ టు బ్యాక్ రెండు ఘోరాలు జరగడంతో తిరువణ్ణామలై పడమర పోలీసులు హై అలర్ట్ అయ్యారు. దర్యాప్తులో ఈ రెండు దారుణాలకు పాల్పడింది మొత్తం 11 మంది ఉన్న ఒకే ముఠా అని గుర్తించారు.

మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో నిందితులైన వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్, శрма, అరుణ్‌కుమార్, శివగణేశన్‌లతో పాటు ఒక 16 ఏళ్ల మైనర్ బాలుడిని (మొత్తం 8 మంది) అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరగడంపై భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story