Taslima Nasreen: 19 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా నస్రీన్!
Taslima Nasreen: బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ 19 ఏళ్ల తర్వాత తిరిగి కోల్‌కతాకు చేరుకున్నారు.
Taslima Nasreen: 19 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా నస్రీన్!
Taslima Nasreen: ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి, సామాజిక కార్యకర్త తస్లీమా నస్రీన్ సుమారు 19 సంవత్సరాల తర్వాత తిరిగి కోల్‌కతాకు చేరుకున్నారు. మానవ హక్కుల సంఘాలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు భారీ భద్రత కల్పించారు.
1962లో బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్‌లో జన్మించిన తస్లీమా నస్రీన్, వృత్తిరీత్యా వైద్యురాలు అయినప్పటికీ రచయిత్రిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 1993లో ఆమె రాసిన 'లజ్జ' (Lajja) నవల తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ పుస్తకంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించడమే కాకుండా, ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుల నుంచి ప్రాణ బెదిరింపులు రావడంతో 1994లో ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
అనేక దేశాల్లో తలదాచుకున్న అనంతరం, 2004లో భారత ప్రభుత్వం తాత్కాలిక నివాస అనుమతి ఇవ్వడంతో ఆమె కోల్‌కతాకు వచ్చి స్థిరపడ్డారు. కోల్‌కతాను తన 'రెండో ఇల్లు'గా ఆమె పేర్కొన్నారు. అయితే, ఆమె ఆత్మకథ 'ద్విఖంది'పై ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో 2007 నవంబర్‌లో కోల్‌కతాలో తీవ్ర స్థాయిలో హింసాత్మక ఆందోళనలు చెలరేగడంతో, అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆమె భద్రత దృష్ట్యా అక్కడ నుంచి జైపూర్, ఆ తర్వాత యూరప్‌కు పంపించివేసింది.
భారత్‌లో జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమెకు అనుమతులు ఉన్నప్పటికీ, కోల్‌కతాలో సాహిత్య ఈవెంట్లకు గతంలో అనుమతి దక్కలేదు. బెంగాల్‌తో ఉన్న సాంస్కృతిక, భాషాపరమైన అనుబంధం కారణంగా కోల్‌కతాలోనే శాశ్వతంగా నివసించాలని భావిస్తున్నట్లు ఆమె పలుమార్లు వెల్లడించారు. కాగా, 1992 మరియు 2000 సంవత్సరాల్లో ఆమె ప్రతిష్టాత్మక 'ఆనంద్ పురస్కారాన్ని' అందుకున్నారు.




