CM Vijay : చెన్నై ఖజానా ఖాళీ.. ప్రభుత్వం కఠిన ఆంక్షలు.!

CM Vijay : తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై రూ.10 కోట్లు దాటే ఏ ప్రాజెక్టుకైనా ప్రభుత్వ అనుమతి

G Krishna
Published on: 2 Aug 2026 12:43 PM IST
cm-vijay
X

cm-vijay

CM Vijay : తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై రూ.10 కోట్లు దాటే ఏ ప్రాజెక్టుకైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై (MAWS) శాఖ కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు తప్పించుకోవడానికి పెద్ద ప్రాజెక్టులను చిన్న చిన్న ముక్కలుగా విభజించి పనులు చేపట్టే పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాలని అధికారులను హెచ్చరించింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లో దాదాపు రూ.2,000 కోట్ల పెండింగ్ బకాయిలు, రూ.1,970 కోట్ల ద్రవ్య లోటు నమోదై తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

నిబంధనలకు పాతిపెట్టి ప్రాజెక్టుల విభజన

స్థానిక సంస్థల అధికారులు కొన్ని చోట్ల ముందస్తు అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను చేపట్టినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక క్లియరెన్స్ అవసరం లేకుండా ఉండేందుకు.. రూ.10 కోట్ల కంటే ఎక్కువ విలువైన పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను రూ.10 కోట్ల కంటే తక్కువ విలువ ఉండేలా కృత్రిమంగా చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించి, స్థానిక సంస్థల నిధులతో పనులు పూర్తి చేస్తున్నట్లు MAWS శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ఈ తరహా అక్రమ పద్ధతులకు పూర్తిగా ముగింపు పలకడానికే 2021 నాటి నిబంధనలను సవరిస్తూ ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

ముందు జీతాలు, పెన్షన్లు.. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులు

కొత్త నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించే ముందు కొన్ని ప్రాధాన్యతలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్ (PF) వంటి అత్యవసర ఆర్థిక బాధ్యతలను ముందుగా నెరవేర్చాలని ఆదేశించారు. చేతిలో సరిపడా నిధులు లేనప్పుడు, ఉన్న బాధ్యతలను పక్కనబెట్టి కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా కట్టడి చేయడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

చెన్నై కార్పొరేషన్‌ను ముంచెత్తిన నిధుల కొరత

ఈ కొత్త ఉత్తర్వులకు చెన్నై కార్పొరేషన్‌లో నెలకొన్న దారుణమైన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం. మార్చి 2026 నాటికి కార్పొరేషన్ ద్రవ్య లోటు రూ.1,970 కోట్లకు చేరుకోగా, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.2,000 కోట్లకు పెరిగిపోయాయి. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.1,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని, దీనివల్ల మొత్తం పెండింగ్ బాధ్యతలు ఏకంగా రూ.3,500 కోట్లకు చేరవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత నిధులతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం, మౌలిక వసతుల కల్పన , రోజువారీ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడమే ఈ సంక్షోభానికి కారణమని కార్పొరేషన్ తెలిపింది.

రాజకీయ నిరసనలు.. పన్నుల వసూళ్ల వేగం

ఈ ఆర్థిక సంక్షోభం కాస్త రాజకీయ రంగు కూడా పులుముకుంది. వార్డుల అభివృద్ధికి కౌన్సిలర్లకు కేటాయించాల్సిన రూ.60 లక్షల నిధులను విడుదల చేయలేదని ఆరోపిస్తూ అధికార డిఎమ్‌కే కౌన్సిలర్లే నిరసన వ్యక్తం చేశారు. నిధులు రాకపోవడంతో వార్డుల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. మరోవైపు సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి చెన్నై కార్పొరేషన్ ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేసింది. గత ఏడాది జూలైలో రూ.61 కోట్లు వసూలు కాగా, ఈ జూలైలో ఏకంగా రూ.158 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ, పాత బకాయిలు , మౌలిక వసతుల ఖర్చుల దృష్ట్యా కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story