Tamil Nadu Election Campaign: తమిళనాడులో పవర్ పాలిటిక్స్... ఎన్డీయే కూటమి తరపున ప్రచారానికి రెడీ
Tamil Nadu Election Campaign: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది.
Tamil Nadu Election Campaign: తమిళనాడులో పవర్ పాలిటిక్స్... ఎన్డీయే కూటమి తరపున ప్రచారానికి రెడీ
Tamil Nadu Election Campaign: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే, అధికారంలోకి రావడానికి ఎన్డీయే కూటమి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి వ్యూహాత్మక ఎత్తుగడలతో రంగంలోకి దిగింది. ఎన్నికల ప్రచారంలోకి ఏపీ నాయకులను దించుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి రావడం ఈ ఎన్నికలకు కొత్త మలుపు తీసుకొస్తుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
తమిళనాడులో పవన్ ప్రచారం
తమిళనాడు నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఎం ఆర్ గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా పవన్ కళ్యాన్ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ఈ ప్రచారంపై తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో సుమారు 15 నుంచి 20 శాతం వరకు తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు ఎన్డీయే పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది. ఇందులో కనీసం 12 నుంచి 13 శాతం ఓట్లు ఎన్డీయే కూటమి సంపాదించగలిగితే గెలుపు ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి ఓటు బ్యాంకు కోసమే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం ద్వారా ఎన్డీయే కూటమి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో మార్పు అవసరం. ఎన్డీయే కూటమి ఆ మార్పు తీసుకురాగలదు అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కూడా ఈ ప్రచారాన్ని కీలక మలుపుగా చూస్తున్నారు. ఈ ఎన్నికల ప్రభావం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాకుండా, ఏపీ తెలంగాణ వంటి రాష్ట్రాలపై కూడా ఉంటుంది. పవన్ ప్రచారాన్ని తెలుగు మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.
గెలుపెవరిది
ప్రస్తుతం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే, డీఎంకే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను కలిగించాయనడంలో సందేహం లేదు. కానీ, తాజా సర్వే ప్రకారం, మిగతా పార్టీల కంటే డీఎంకే ఒక అడుగు ముందుందని తెలుస్తోంది. ఇక డీఎంకేను గద్దెదించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్డీయే కూటమి బలమైన పోటీకి సిద్దమవుతోంది. మొత్తం 224 స్థానాలకుగాను అన్నాడీఎంకే 178 చోట్ల పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా బీజేపీ 27 స్థానాల్లో, పీఎంకే 18, ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక తమిళనాడులో మూడో శక్తిగా ఎదగాలని చూస్తున్న విజయ్ పార్టీ టీవీకే 234 స్థానాల్లో పోటీ చేస్తున్నది. యువతలో మంచి క్రేజ్ ఉన్న ఈ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యతిరేక ఓట్లు చీలడం అధికారిక డీఎంకే కంటే ప్రతిపక్ష ఎన్డీయేకి ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనా. మొత్తంగా చూసుకుంటే ఈసారి తమిళనాడు ఎన్నికలు త్రిముఖ పోటీగా మారాయి. డీఎంకే తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటే, ఎన్డీఏ కూటమి మార్పు నినాదంతో ముందుకు వస్తోంది. మరోవైపు టీవీకే యువత మద్దతుతో కొత్త రాజకీయ సమీకరణాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమీకరణాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎంత ప్రభావం చూపుతుందో, ఫలితాల రోజునే స్పష్టమవుతుంది.




