MK Stalin: విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి

MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 19 May 2026 2:42 PM IST
MK Stalin
X

MK Stalin: విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి

MK Stalin: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ప్రభుత్వంపై డీఎంకే (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగదని, ఎప్పుడైనా కూలిపోవచ్చని జోస్యం చెప్పారు. డీఎంకే పార్టీ శ్రేణులంతా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు.

డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల కీలక సమావేశంలో ఎంకే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై ఆయన స్పందిస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. "ఇటీవలి ఎన్నికల్లో మనకు ఎదురైన ఓటమి కేవలం తాత్కాలికం మాత్రమే. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండే పరిస్థితి లేదు. ఏ క్షణంలోనైనా ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చు" అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, డీఎంకే శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించారు.

వచ్చే ముందస్తు ఎన్నికల్లో డీఎంకే రికార్డ్ మెజారిటీతో మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. "తమిళనాడు రాజకీయ యవనికపై డీఎంకే పార్టీ గుర్తు అయిన 'ఉదయ సూర్యుడు' ఎప్పటికీ అస్తమించడు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం" అని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి పూర్తి బాధ్యతను తానే స్వీకరిస్తున్నట్లు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, పార్టీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆయన తక్షణ చర్యలు ప్రారంభించారు. ఓటమికి గల అసలు కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించేందుకు, నేరుగా ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్ సేకరించేందుకు 36 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు స్టాలిన్ వెల్లడించారు.

కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలన ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మాజీ సీఎం స్టాలిన్ ఈ రేంజ్‌లో అటాక్ చేయడం, ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story