Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. సీఎం విజయ్, త్రిషలపై వ్యాఖ్యల కేసులో డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్!

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, నటి త్రిషలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 3 July 2026 2:51 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. సీఎం విజయ్, త్రిషలపై వ్యాఖ్యల కేసులో డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్!

Anitha Radhakrishnan: తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న 'ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకే (DMK)' వివాదం తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీసింది. సీఎం విజయ్ మరియు ప్రముఖ నటి త్రిషలను ఉద్దేశించి వ్యక్తిగత జీవితాన్ని లాగుతూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు శుక్రవారం (జులై 3) నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే ఆత్తూరు పోలీసులు రంగంలోకి దిగి ఈ చర్యలు చేపట్టారు.

గత జూన్ 20న తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన ఒక పార్టీ బహిరంగ సభలో అనితా రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ హావభావాలను ఎగతాళి చేస్తూ.. “తాను సినిమా ఇండస్ట్రీ వదిలి రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయానని విజయ్ బాధపడుతున్నారు. అసెంబ్లీలో ఆయన ముఖం చూస్తే ఆ విషయమే స్పష్టమవుతోంది. ఇల్లు, సినిమా ఇండస్ట్రీలోనే నటి త్రిషతో ఎంతో సంతోషంగా గడిపిన రోజులను బహుశా ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో” అంటూ వ్యక్తిగత అంశాలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ముఖ్యమంత్రిని, ఒక మహిళా నటిని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని టీవీకే పట్టణ కార్యదర్శి సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై చట్టప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అరెస్ట్ భయంతో అనితా రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరగా.. న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తీవ్రంగా కొట్టేసింది. “మీరు ఒక సామాన్య పౌరుడు కాదు, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి. పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస గౌరవం ఇవ్వాల్సిందే” అని కోర్టు స్పష్టం చేసింది. 1967 నుండి తమిళనాడు ప్రజలు సినీ రంగం నుండి వచ్చిన నేతలను ఆదరిస్తూ గెలిపిస్తున్నారని, అలాంటప్పుడు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ను వంకపెట్టి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

కోర్టు ఆదేశాలు వెలువడిన కొద్దిసేపటికే, ఆత్తూరు టౌన్ పంచాయతీ పరిసరాల్లో రికార్డులను పరిశీలిస్తున్న అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివచ్చి పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు డీఎంకే శ్రేణులను చెదరగొట్టి, ఆయనను తూత్తుకుడి ఎస్పీ ఆఫీసుకు తరలించారు.

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకేకు చెందిన ఇంతటి ముఖ్య నేత అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. ఈ అరెస్ట్‌ను మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలను కాపాడలేని ఈ ప్రభుత్వం, కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతోందని, దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని స్టాలిన్ ఎక్స్ (X) వేదికగా హెచ్చరించారు. ఏదేమైనా ఈ అరెస్ట్ ప్రస్తుతం తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story