Viral News: ఫోన్ చేసి నమ్మించాడు.. గుండు కొట్టించాక స్విచ్ ఆఫ్ చేశాడు!

Viral News: తమిళనాడులోని సేలంలో విచిత్రమైన మోసం వెలుగుచూసింది.

Arun Chilukuri
Published on: 29 July 2026 11:27 AM IST
Viral News
X

 Viral News: ఫోన్ చేసి నమ్మించాడు.. గుండు కొట్టించాక స్విచ్ ఆఫ్ చేశాడు!

Viral News: తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌ వద్ద ఒక విచిత్రమైన మరియు విస్తుపోయే మోసం వెలుగులోకి వచ్చింది. కొత్త రకం కరోనా వైరస్ వ్యాపిస్తోందని, దానికి గుండు కొట్టించుకోవడమే పరిష్కారమని నమ్మించి ముగ్గురు మహిళలను దారుణంగా మోసగించాడు ఓ అపరిచిత వ్యక్తి.

ఆత్తూర్‌ సమీపంలోని పుదుకొత్తాంబాడి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్‌ అనే మహిళకు సోమవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తాను స్థానిక తాలూకా కార్యాలయం నుంచి తహసీల్దార్‌గా మాట్లాడుతున్నానని సదరు వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.

ప్రస్తుతం కొత్త రకం కరోనా తరహా వ్యాధి వేగంగా విస్తరిస్తోందని, దాని నుంచి రక్షణ పొందాలంటే మహిళలు గుండు కొట్టించుకోవాలని నమ్మబలికాడు. అంతేకాకుండా, అలా గుండు కొట్టించుకున్న వారికి ప్రభుత్వం తరఫున సహాయ నిధిగా రూ.15,000 నుంచి రూ.45,000 వరకు ఆర్థిక సాయం అందజేస్తామని ఆశ చూపాడు.

తహసీల్దార్ మాటలను నిజమని నమ్మిన ఆ గ్రామానికి చెందిన కావేరి (56), రామాయి (58), చిత్ర (60) అనే ముగ్గురు మహిళలు వెంటనే గుండు కొట్టించుకున్నారు. వీరిని చూసి గ్రామానికి చెందిన మరో 20 మంది మహిళలు కూడా గుండు కొట్టించుకోవడానికి సిద్ధమయ్యారు.

గుండు కొట్టించుకున్న అనంతరం డబ్బుల విషయమై సదరు వ్యక్తికి ఫోన్ చేయగా, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తమను ఎవరో మోసం చేశారని గ్రహించిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అపరిచిత వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విచిత్ర మోసం ప్రస్తుతం ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story