TVK Chief Vijay: స్టాలిన్ చేతిలో కాంగ్రెస్.. నా విడాకులపై కుట్రలు

Tamil Nadu Elections 2026: తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు. సీఎం స్టాలిన్, కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు. తన వ్యక్తిగత జీవితం మరియు సినిమాలపై జరిగిన కుట్రలను బయటపెట్టిన విజయ్.

Arun Chilukuri
Published on: 8 April 2026 3:36 PM IST
TVK Chief Vijay
X

TVK Chief Vijay: స్టాలిన్ చేతిలో కాంగ్రెస్.. నా విడాకులపై కుట్రలు

TVK Chief Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ, తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న బంధంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్ వరకు హాట్ టాపిక్‌గా మారాయి.

స్టాలిన్ గుప్పిట్లో కాంగ్రెస్!

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయిందని విజయ్ విమర్శించారు. "రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని సీఎం స్టాలిన్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ నిజమైన కాంగ్రెస్ వాదులు, ఆ సిద్ధాంతాన్ని నమ్మే నేతలు మాత్రం మా వెంటే ఉన్నారు" అని విజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కూటమి పార్టీలు కనీసం తమ సొంత ఓట్లను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.

నాపై వ్యక్తిగత కుట్రలు.. విడాకుల అంశంపై క్లారిటీ!

ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే తనను అణచివేయడానికి వ్యవస్థీకృత కుట్రలు జరిగాయని విజయ్ ఆరోపించారు. "నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి చివరకు నా వ్యక్తిగత జీవితాన్ని కూడా వాడుకున్నారు. నా భార్యతో విడాకుల అంశాన్ని కావాలనే తెరపైకి తెచ్చి ప్రజల్లో నాపై ఉన్న నమ్మకాన్ని తగ్గించాలని చూశారు. కానీ నా అభిమానులు, ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమాలు, సభలపై ఆంక్షలు

తన రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవడానికి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని విజయ్ ధ్వజమెత్తారు. తన చిత్రం 'జననాయగన్' విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ప్రచార సభలను అడ్డుకోవడానికి పోలీసులను ప్రయోగించారని, కరూర్ తొక్కిసలాట వెనుక ఉన్న నిజాలు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.

"తలపై ఉన్న వెంట్రుకలను ఎవరూ పీకలేరు" అన్నట్టుగా సైగ చేస్తూ.. ఎన్ని కుట్రలు చేసినా తనను, తన పార్టీని ఎవరూ ఆపలేరని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. విజయ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలతో తమిళనాడు ఎన్నికల రణం మరింత రసవత్తరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story