Tamil Nadu CM Race: ఆసక్తికరంగా మారుతున్న తమిళ రాజకీయం... సీఎం కుర్చీకోటం పోరాటం

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అది 'దళపతి' విజయ్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నా, యావత్ దేశం చూపు మాత్రం చెన్నై వైపే ఉంది.

Balachander
Published on: 4 May 2026 12:00 PM IST
Tamil Nadu CM Race: ఆసక్తికరంగా మారుతున్న తమిళ రాజకీయం... సీఎం కుర్చీకోటం పోరాటం
X

Tamil Nadu CM Race: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అది 'దళపతి' విజయ్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నా, యావత్ దేశం చూపు మాత్రం చెన్నై వైపే ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, రాజకీయ ఉద్ధండులకు విజయ్ చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 10-12 సీట్లకే పరిమితం అవుతారన్న విశ్లేషణలను పటాపంచలు చేస్తూ, టీవీకే (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది.

మ్యాజిక్ ఫిగర్ దిశగా..

ఎన్నికల కౌంటిగ్‌ కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్స్‌ ప్రకారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ పార్టీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటికే 110 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుంది. మెజారిటీ మార్క్‌ అందుకోవాలంటే 118 స్థానాల్లో విజయం సాధించాలి. దీనికోసం టీవీకేకి ఇంకా 8 స్థానాలు అవసరం. కౌంటింగ్‌ కొనసాగుతున్నది కాబట్టి మెజారిటీ మార్క్‌ అందుకునే అవకాశాలు లేకపోలేదు. లేదా మెజారిటీ ముందు వరకు వచ్చి ఆగిపోవచ్చు కూడా. ఏదైనా జరగొచ్చు. ఒకవేళ మధ్యాహ్నం లోపు ఈ సంఖ్య 118 దాటితే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే. ఒకవేళ స్వల్పంగా తగ్గితే, 'కింగ్ మేకర్' పాత్ర కోసం డీఎంకే లేదా అన్నాడీఎంకేలు పోటీ పడాల్సి ఉంటుంది. కానీ, విజయ్‌ టీవీకే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు అన్నాడీఎంకే గతంలో సాధించిన స్థానాలను నిలబెట్టుకుంటూనే, కౌంటింగ్‌ ముగిసేలోగా మరికొన్ని స్థానాలను సొంతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నది. ఈ మూడు ముక్కలాటలో భారీగా నష్టపోయింది మాత్రం డీఎంకేనే. తమిళనాడు ఓటర్లు ఒకసారి ఒకరికి మరోసారి మరొకరికి అధికారాన్ని కట్టబెట్టే సంప్రదాయం ఉంది. కానీ, ఈసారి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను కాదని కొత్తగా వచ్చిన టీవీకేకు భారీ సీట్లు కట్టబెట్టడమే ఆశ్చర్యం.

నటుల అడ్డా.. రాజకీయ గడ్డ!

తమిళనాడుకు సినీ నటులను సింహాసనంపై కూర్చోబెట్టే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల వారసత్వాన్ని విజయ్ అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో విజయ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి, సభల్లో తొక్కిసలాటలు జరిగాయి, ప్రత్యర్థి పార్టీలు ఆయన అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేశాయి. వీటన్నింటినీ తట్టుకుని విజయ్ నిలబడిన తీరు ఓటర్లను, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంది.

విజయ్ ‘అలర్ట్’.. చెన్నైకి అభ్యర్థుల తరలింపు

ఫలితాల సరళిని గమనిస్తున్న విజయ్, అప్పుడే తన వ్యూహాలకు పదును పెట్టారు. గెలిచిన లేదా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులెవరూ నియోజకవర్గాల్లో ఉండవద్దని, తక్షణమే చెన్నైకి చేరుకోవాలని హుకుం జారీ చేశారు. ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రలోభపెట్టకుండా ఉండేందుకే విజయ్ ఈ 'క్యాంప్' పాలిటిక్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

రాజకీయ సమీకరణాలు మారతాయా?

దశాబ్దాలుగా అవినీతిలో కూరుకుపోయిన ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా విజయ్ తనను తాను ప్రెజెంట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు పూర్తి మెజారిటీ రాకపోతే, తను విమర్శించిన పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటారా? లేక చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో గట్టెక్కుతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, ఈ సోమవారం మధ్యాహ్నం వెలువడే తుది ఫలితాలు తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ ఎవరిదో తేల్చేయనున్నాయి. చూద్దాం తమిళనాడులో ఏం జరుగుతుందో. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. ఈ మార్పును విజయ్‌ సొంతం చేసుకున్నాడు. విజయ్‌ టీవీకే అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారన్నది అందరిముందున్న ప్రశ్న. ఇప్పటి వరకు సినీ జీవితానికే పరిమితమైన విజయ్‌ ఇప్పుడు రాజకీయ జీవితాన్ని ఎలా ప్రారంభిస్తారన్నది కూడా ఆలోచించాల్సిందే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story