Flight Catches Fire : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హై టెన్షన్.. మంటల మధ్యే ఎమర్జెన్సీ ఎగ్జిట్.. 232 మంది సేఫ్
Flight Catches Fire : ఢిల్లీ విమానాశ్రయంలో జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్ విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో ఇంజిన్ మంటలు చెలరేగగా, ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. 232 మంది ప్రయాణికులు సురక్షితం.
Swiss Air Flight Catches Fire
Flight Catches Fire : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్ విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని నిలిపివేయడంతో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం (ఏప్రిల్ 26) తెల్లవారుజామున 1:08 గంటల సమయంలో స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A330 (ఫ్లైట్ LX147) ఢిల్లీ నుంచి జ్యూరిచ్‌కు బయలుదేరడానికి సిద్ధమైంది. విమానం రన్‌వేపై వేగంగా వెళ్తూ టేకాఫ్ అవ్వడానికి కొద్ది సెకన్ల ముందు, విమానం ఒక ఇంజిన్‌లో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పరిస్థితిని గమనించిన పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేకాఫ్‌ను రద్దు చేసి, ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు.
విమానం ఆగిపోగానే క్రూ మెంబర్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ స్లయిడ్ల (గాలితో నిండిన జారే మెట్లు) ద్వారా ప్రయాణికులను కిందకు దింపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట, కంగారులో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో మొత్తం 228 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మంటలు చెలరేగగానే విమానంలో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొందరు వృద్ధులు, పిల్లలు ఎమర్జెన్సీ స్లయిడ్ల ద్వారా దిగడానికి ఇబ్బంది పడటంతో, సిబ్బంది మెట్ల సాయంతో వారిని కిందకు దించారు. ఇంజిన్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పౌర విమానయాన శాఖ (DGCA) సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఆ విమానాన్ని టెక్నికల్ బృందం పరిశీలిస్తోంది.
ఒకవేళ విమానం గాల్లోకి లేచిన తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉంటే ఫలితం దారుణంగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రన్‌వేపైనే ఈ లోపాన్ని గుర్తించి పైలట్ తీసుకున్న నిర్ణయం వందలాది కుటుంబాల్లో వెలుగు నింపింది. ప్రయాణికులందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్‌లైన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.




