Supreme Court: వీడియోలు చూసే సమయం లేదు.. 'చలో సంసద్' పిటిషన్‌పై సీజేఐ ఆగ్రహం!

Supreme Court: కాక్రోచ్ జనతాపార్టీ (CJP) ‘చలో సంసద్’ మార్చ్‌పై పోలీసుల లాఠీఛార్జీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Arun Chilukuri
Published on: 22 July 2026 2:45 PM IST
Supreme Court
X

Supreme Court: వీడియోలు చూసే సమయం లేదు.. 'చలో సంసద్' పిటిషన్‌పై సీజేఐ ఆగ్రహం!

Supreme Court: కాక్రోచ్ జనతాపార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్‌లో నిరసనకారులపై పోలీసు చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టలేమని సీజేఐ స్పష్టం చేశారు.

విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "కోర్టు సమయాన్ని వృథా చేయవద్దు, అలాగే పిటిషనర్ కూడా తన సమయాన్ని వృథా చేసుకోవద్దు" అని సూచించారు. నిరసనకారులపై జరిగిన లాఠీఛార్జికి సంబంధించిన వీడియోలను పరిశీలించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, "మాకు వీడియోలు చూసే సమయం లేదు" అని సీజేఐ వ్యాఖ్యానించారు.

అంతకుముందు ఈ వ్యవహారంలో అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలోకి తమను లాగొద్దని స్పష్టం చేయడంతో పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసు లాఠీఛార్జీపై కోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు.

నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ CJP చేపట్టిన ‘చలో పార్లమెంట్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది సీజేపీ మద్దతుదారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంటు వైపు దూసుకురావడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీఛార్జి చేశారు. ఆందోళనకారుల రాళ్లదాడి, తోపులాటల వల్ల ఇరువైపులా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు రక్తమోడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story